ఓబీసీల్లో చీలికకు కాంగ్రెస్- జేఎంఎం కూటమి కుట్ర చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించకూడదంటే ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఐక్యత ఉంటేనే భద్రత ఉంటుందన్నారు. గతంలో ఓబీసీలు, గిరిజనులు, దళితుల మధ్య ఐక్యతలేకపోవడంతోనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయగల్గిందన్నారు.
కాంగ్రెస్, జేఎంఎంలు పన్నే కుట్రల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎంతకైనా దిగజారుతాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. అధికారం మాటున ప్రజలను దోచుకుంటుందన్నారు.
ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ప్రయత్నిస్తున్నాయని అదే జరిగితే భారత సైనికులు మరిన్ని ఉగ్రదాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
చొరబాటుదారులను తరిమేందుకు అవినీతి రహిత పాలనకు ఝార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అవసరమని ప్రధాని పేర్కొన్నారు. అధికార జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం సృష్టించిన రిక్రూట్‌మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపుతామన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిపై చర్యలు తప్పవని మోదీ హెచ్చరించారు.