కాంగ్రెస్, శివసేన(యుబిటి), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీల మహా వికాస్ అఘాడి కూటమి నేతలు ముంబైలో మ్యానిఫెస్టో విడుదల చేశారు. మ్యానిఫెస్టోలో యువత, మహిళలు,రైతులకు పలు హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.3 వేలు, నిరుద్యోగ యువతకు రూ.4 వేలు అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి రూ.500లకే ఆరు సిలిండర్లు ప్రకటించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు, ఫసల్ బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.
కూటమి మ్యానిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విడుదల చేశారు. రైతుల ఆదాయం పెంచడంతోపాటు ఆత్మహత్యల నిరోధానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారం భారీగా పెంచుతామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు.
బీజేపీ రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీజేపీ పాలనలో మహారాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారని ఖర్గే విమర్శలు చేశారు. బీజేపీ మ్యానిఫెస్టోలో మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.2100 కన్నా ఎక్కువ ఇస్తామంటూ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. బాలికలకు ఉచితంగా సర్వైకల్ క్యానర్స్ వ్యాక్సిన్ ఇప్పిస్తామంటూ చెప్పారు. ఇక మహిళా ఉద్యోగులకు నెలకు 2 రోజులు పీరియడ్ సెలవులు ఇస్తామంటూ మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.
తాము అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కులగణన చేపడతామంటూ ప్రకటించారు. అఘాడి కూటమి అధికారంలోకి వస్తే ఆరోగ్య బీమా పరిమితిని మరింత పెంచుతామన్నారు.