జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాలు జమ్ముకశ్మీర్‌లోని కిస్త్‌వార్ ప్రాంతంలో గస్తీ తిరుగుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైనికులు ఎదురు కాల్పులు మొదలు పెట్టారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. వారిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఒకరు ఉన్నారు.
గత వారం జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు గ్రామరక్షకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన తరవాత వరుస ఎన్‌కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో ఇది మూడో ఎన్‌కౌంటర్. గ్రామరక్షకులను కాల్చి చంపిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ప్రస్తుతం కిస్త్‌వార్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో గ్రామ రక్షకులను మట్టుబెట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని రక్షణశాఖ అధికారులు వెల్లడించారు
వారం రోజుల్లో జమ్ము కశ్మీర్‌లో ఆరు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. శ్రీనగర్ సమీప జబర్వార్ అడవుల్లోనూ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. పాక్ సరిహద్దు నుంచి వందలాది ఉగ్రవాదులను చొప్పిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బలగాలు గస్తీ తీవ్రతరం చేశాయి.