తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 18 తేదీ లోపు ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు వెల్లడించారు. పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించామన్నారు. రూ.50 నుంచి రూ.500 ఆలస్య రుసుం చెల్లించి డిసెంబరు 21 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. ఫీజును విద్యార్థులు హెచ్‌ఎంకు చెల్లిస్తే వారు బోర్డుకు జమ చేస్తారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపు ఉంటే ఫీజు మినహాయింపు ఉంది. ఆదాయ ధ్రువపత్రం సహా ఇతర అర్హత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పదో తరగతి పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 5.25 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.