కెనడా మరో దూకుడు నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యార్ధులతోపాటు, విదేశీ విద్యార్ధులకు త్వరగా వీసా అందించే స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భారత్ సహా పలు దేశాలకు చెందిన విద్యార్థులకు వీసా ఇబ్బందులు తప్పేలా లేవు. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ పథకం అమల్లో ఉంటే విద్యార్థుల వీసా మంజూరు ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఈ పథకం రద్దు కావడంతోపాటు, విద్యార్థుల వీసాల సంఖ్య కూడా కెనడా భారీగా తగ్గింది.
ఈ ఏడాది స్టూడెంట్ వీసాలు 35 శాతం తగ్గిస్తామని, వచ్చే ఏడాది మరో పది శాతం తగ్గిస్తామంటూ కెనడా ప్రధాని ట్రూడో గత నెలలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్డిఎస్ పథకాన్ని రద్దు చేయడంతో విద్యార్ధులకు వీసా కష్టాలు తప్పేలా లేవు.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య తరవాత భారత్, కెనడా దౌత్యసంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో కెనడాలోని కాన్సులేట్ క్యాంపులను కూడా భారత్ ఎత్తివేసింది. నిజ్జర్ హత్య వెనుక భారత నిఘా సంస్థ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.