హైదరాబాద్ నగరంలో భారీ పేలుడు జరిగింది. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లోని తెలంగాణ స్పైస్ కిచెన్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. హోటల్లోని ఫ్రిజ్ కంప్రెషర్ పేలి భారీ నష్టం వాటిల్లింది.పేలుడు ధాటికి గోడ కూలిపోయింది. రాళ్లు ఎగిరి సమీపంలోని దుర్గానగర్ బస్తీలో పడ్డాయి. స్థానికులు కాసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనా స్థలాన్ని డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి పరిశీలించారు. హోటల్ నిర్వాహకులతో మాట్లాడారు. హోటల్ సిబ్బంది మీడియాను లోపలకు అనుమతించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు.
రద్దీగా ఉండే హోటల్లో భారీ పేలుడు జరగడంతో జనం పరుగులు తీశారు. బాంబులు పేలాయని భావించారు. ఫ్రిజ్ పేలిపోయిందని తేలడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.