బంగ్లాదేశ్‌లో హిందువుల బాధలకు అంతేలేకుండా పోయింది. రాడికల్ ఇస్లామిస్టులు హిందువులకు వ్యతిరేకంగా ఉన్మాద ప్రచారం చేస్తున్నా దాన్ని తప్పించుకుని బతికి బట్టకట్టడానికి నానాతంటాలూ పడుతున్నారు.
హిందువులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న సంస్థ హెఫాజత్ ఎ ఇస్లామ్. తాజాగా ఆ సంస్థ ఇస్కాన్‌ను నిషేధించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, ఇస్కాన్ సభ్యులైన కృష్ణభక్తులను చంపేయాలంటూ పిలుపునిచ్చింది. ఆ సంగతిని బహిరంగంగా నినాదాలు ఇవ్వడం మాత్రమే కాదు, ‘ఇస్కాన్ సభ్యులను పట్టుకోండి, నరికి చంపేయండి’ అంటూ గోడల మీద రాస్తోంది.
ఇస్కాన్ – ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్’ – అనేది గౌడీయ వైష్ణవ సంప్రదాయానికి చెందిన హిందూ ధార్మిక సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాని శాఖలున్నాయి. బంగ్లాదేశ్‌లో నాలుగు ఇస్కాన్ శాఖలు ఉన్నాయి. చిట్టగాంగ్, నవఖాలీ, మేమెన్‌సింగ్, ఢాకా నగరాల్లో ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి.
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ పనితీరు మీద ఎలాంటి ఫిర్యాదులూ లేవు. కానీ హెఫాజత్ ఎ ఇస్లాం సంస్థ ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకోడానికి ఏకైక కారణం అది హిందువులకు ప్రధానమైన చిహ్నం కావడమే.
హెఫాజత్ ఎ ఇస్లాం సంస్థ 2010లో ఏర్పడింది. షేక్ హసీనా పార్టీ ‘అవామీ లీగ్’ను వ్యతిరేకించడమే దాని ప్రధాన లక్ష్యం. ముస్లిం మతఛాందస నియమాలను బంగ్లాదేశ్ అంతటా వర్తింపజేయాలని దాని లక్ష్యం. అవామీ లీగ్ ప్రారంభించిన మహిళల అభివృద్ధి పాలసీని, ఆస్తిలో మహిళలకు సమానహక్కు ఇవ్వాలనే విధానాన్ని వ్యతిరేకించడంతో హెఫాజత్ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. 2013 నుంచీ ఆ సంస్థ బలం పుంజుకుంది, మరింత దారుణంగా మతోన్మాదాన్ని వ్యాపింపజేస్తోంది. బంగ్లాదేశ్‌ను తాలిబాన్ల పాలనలోని అప్ఘానిస్తాన్‌లా మార్చాలన్నది హెఫాజత్ సంస్థ లక్ష్యం. బంగ్లాదేశ్ 50వ అవతరణ ఉత్సవాలకు భారత ప్రధాని నరేంద్రమోదీ అతిథిగా హాజరవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఏకంగా రక్తపాతమే సృష్టించింది. ఆ అల్లర్లలో 13మంది ప్రాణాలు కోల్పోయారు.
హెఫాజత్ సంస్థను స్థాపించిన అహ్మద్ షఫీ నేతృత్వంలో ఉన్నప్పుడు చిన్నచిన్న ఆందోళనలు చేస్తూ ఉండేవారు. షఫీ 2020లో మరణించాక సంస్థను జునెయిద్ బాబూనగరి నడిపించాడు. అప్పటినుంచీ సంస్థ మతోన్మాదంగా, హింసాత్మకంగా మారింది. 2021లో జునెయిద్ చనిపోయినా సంస్థ పంథా మారలేదు సరికదా మరింత మూర్ఖంగా తయారైంది. ఇప్పుడు ఇస్కాన్‌ను బంగ్లాదేశ్ నుంచి తుడిచిపెట్టాలనే లక్ష్యం పెట్టుకుంది.
ఇస్కాన్‌పై దాడులకు హెఫాజత్ పిలుపును ఖండిస్తూ ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఎక్స్‌లో ట్వీట్ చేసారు. ‘‘హెఫాజత్ ఉగ్రవాద పిలుపునిచ్చింది. వాళ్ళు ఇస్కాన్ సభ్యులను చంపేయాలంటున్నారు. ఇస్కాన్‌ను నిషేధించడానికి అదేమైనా ఉగ్రవాద సంస్థా? హరేకృష్ణ, హరేరామ అని ప్రార్థనలు చేస్తూ వారు ఎవరినైనా చంపారా? ఇస్లామిక్ ఉగ్రవాదులు మాత్రం అల్లాహో అక్బర్ అని అరుస్తూ జనాలను చంపుతుంటారు. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉంది. ఎక్కడా వారికి సమస్యల్లేవు, కానీ బంగ్లాదేశ్‌లో సమస్య వచ్చింది. ఎందుకు? ఎందుకంటే ఈ దేశంలో ఇతర మతాల వారిని సహించలేని ఇస్లామిస్టులు, జిహాదిస్టులూ పెద్దసంఖ్యలో ఉన్నారు. ముస్లిమేతరులను హింసించడానికి, వారి భూమి నుంచి వారిని తరిమి కొట్టడానికి ఈ జిహాదీలు అన్నిరకాల దుర్మార్గాలకూ పాల్పడతారు. ఇక్కడ హెఫాజత్ ఉగ్రవాదిగా వ్యవహరిస్తోంది, ఇస్కాన్ ఊచకోతకు గురైన మైనారిటీల్లా మారింది’’ అంటూ తస్లీమా ఆవేదన వ్యక్తం చేసారు.