కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అకోలాలో పర్యటించిన ప్రధాని మోదీ, బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ అజెండాను కాంగ్రెస్ అమలు చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు గాంధీ కుటుంబానికి ఏటీఎంలా మారాయని ఆరోపించారు. ఆర్టికల్ 370 పునరుద్దరణ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న మోదీ, ఎట్టి పరిస్థితుల్లో అది జరగదని తేల్చి చెప్పారు. హర్యానాలో బీజేపీకి మూడోసారి పట్టం కట్టినట్లే, మహారాష్ట్రలో ఎన్డీయే హవా కనిపిస్తోందన్నారు.
కాంగ్రెస్ నేతలు… తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ నుంచి వేల కోట్లు మహారాష్ట్రకు తరలించారని ఆరోపించిన ప్రధాని మోదీ, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్ రాజ కుటుంబానికి కప్పం కడుతున్నాయన్నారు. తెలంగాణ, కర్ణాటకలో వసూలు చేసన డబ్బును మహారాష్ట్ర ఎన్నికల్లో పంచుతున్నారని దుయ్యబట్టారు.
మహారాష్ట్ర అభివృద్ధి కోసం మహాయుత ప్రభుత్వం అవసరమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం మహారాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్డీయేకే ప్రజలు ఓటువేయాలని ప్రధాని మోదీ కోరారు.