భవిష్యత్ అంతా పర్యాటకానిదేనని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘భవిష్యత్‌లో ఏ ఇజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఏపీలో సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించారు. సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఉన్నతాధికారులు ఇందులో ప్రయాణించారు.
సీప్లేన్ ప్రయాణాన్ని వినూత్న అవకాశంగా అభివర్ణించిన చంద్రబాబు, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని ఉద్ఘాటించారు. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోందన్న సీఎం చంద్రబాబు, దానిని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఐటీ అంటే గతంలో పలువరు ఎగతాళి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువాళ్ళే ఉన్నారన్నారు. భవిష్యత్ లో సీప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుందన్నారు.
రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థను బాగుచేయడంతో పాటు త్వరగా అనుకున్న ప్రగతిని సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పొగొట్టిన బ్రాండ్‌ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూటమి తీసుకుందన్నారు. ఎన్డీయేకు ఓటు వేసి వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు ఆక్సిజన్ ఇచ్చారని పేర్కొన్నారు.