కృష్ణా జల వివాదం ఏపీ తెలంగాణ అధికారుల మధ్య తోపులాటకు దారితీసింది. తాజాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ వద్ద నీటి విడుదల రీడింగ్ తీసుకునేందుకు తెలంగాణ అధికారులు వచ్చారు. వారిని ఏపీ అధికారులు అడ్డుకున్నారు. కుడి కాలువ వద్ద మీకేం పనంటూ ఏపీ అధికారులు వారిని వెనక్కు పంపించారు. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏపీ అధికారుల తీరుపై తెలంగాణ అధికారులు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు.
రెండు రాష్ట్రాల అధికారుల మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతానికి సర్దుకుంది. నాగార్జునసాగర్ ఎస్‌ఈ కృష్ణమోహన్ ఇరువర్గాలతో మాట్లాడి పంపించివేశారు. అటు తెలంగాణ అధికారులు ఇప్పటికే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయగా, ఏపీ అధికారులు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా జలాల పంపిణీ విషయంలో సాగర్ ప్రాజెక్టు వద్ద గతంలోనూ వివాదాలు చెలరేగాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువపై తెలంగాణ అధికారుల పెత్తనంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదులు అందాయి. ప్రాజెక్టు నిర్వహిణను కృష్ణా బోర్డు పరిధిలో ఉంది. ఈ ఏడాది పుష్కలంగా నీరు రావడంతో ఏపీ, తెలంగాణ కాలువలకు పెద్దఎత్తున నీరు విడుదల చేస్తున్నారు.