గత వైసీపీ ప్రభుత్వం అవినీతి, డ్రగ్స్‌ను ప్రోత్సహించిందని, దేశంలో ఏ మూల కొకైన్, గంజాయి పట్టుబడ్డా మూలాలు ఏపీలో ఉండేవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. విశాఖలో వేల కోట్ల విలువైన కొకైన్ పట్టుకున్నారని, దాని మూలాలు విజయవాడలో బయటపడ్డాయన్నారు. వైసీపీ నేతలు గంజాయి, డ్రగ్స్ ముఠాలకు కొమ్ముకాశారంటూ ఎక్స్ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మాదకద్రవ్యాలు ఏపీలో పెనుముప్పుగా మారాయన్నారు. వాటి వినియోగంతో నేరాలు కూడా పెరిగిపోతున్నాయని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుంచి అవినీతి కూటమికి సంక్రమించిందన్నారు. దాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
విశాఖ ఓడరేవులో గత ఏడాది పట్టుబడ్డ వేల కోట్ల విలువైన కొకైన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఏపీలో నేరాలు పెరగడానికి మాదకద్రవ్యాల వినియోగం కూడా కారణమంటూ పోలీసులు అధికారులు చెబుతున్నారు.