నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత పశ్చిమం వైపు కదులుతూ రెండు రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంగా వెళ్తుందని అంచనా వేసింది.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. రానున్న మూడు రోజులపాటు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
దక్షిణ కోస్తా తీరంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.