ఇండీ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ సిపిఎం, వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపయెన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంలేని సంగతి తెలిసిందే. ఆ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం నేత పినరయి విజయన్ కాంగ్రెస్‌పై తన దాడిని ఉధృతం చేస్తున్నారు. వయనాడ్ ఉపయెన్నికలో, ముస్లిం సంస్థ జమాతే ఇస్లామీ మద్దతుతోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారని పినరయి విజయన్ మండిపడ్డారు.
పినరయి తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వయనాడ్ ఉపయెన్నిక కాంగ్రెస్ సెక్యులర్ ముసుగును పూర్తిగా తొలగించిందని వ్యాఖ్యానించారు. ‘‘జమాతే ఇస్లామీ మద్దతుతోనే ప్రియాంకా గాంధీ వయనాడ్‌లో అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. మరి, కాంగ్రెస్ వైఖరి ఏంటి?జమాతే ఇస్లామీ గురించి మన దేశానికి తెలియనిదేమీ లేదు. ఆ సంస్థ సిద్ధాంతాలు ప్రజాస్వామిక విలువలతో కలుస్తాయా?’’ అని ప్రశ్నించారు.
ఈ దేశానికి కానీ, ఈ దేశపు ప్రజాస్వామ్యానికి కానీ జమాతే పూచికపుల్లంత విలువైనా ఇవ్వదని పినరయి విజయన్ గుర్తుచేసారు. ‘‘ఈ దేశపు పరిపాలనా వ్యవస్థను జమాతే బేఖాతరు చేస్తుంది. వెల్ఫేర్ పార్టీ అనే రాజకీయ పక్షపు ముసుగుతో ఈ దేశపు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నట్లు నటిస్తుంది. ఆ విషయం జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో స్పష్టమైంది. జమాతే ఇస్లామీ చాలాకాలంగా జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. తర్వాత ఆ సంస్థ బీజేపీతో కశ్మీర్‌లో చేతులు కలిపింది’’ అని పినరయి విజయన్ ఆరోపించారు.
ఇటీవల జరిగిన జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ 3-4 స్థానాల్లో పోటీ చేయాలనుకుంది. కానీ చివరికి సిపిఎం నాయకుడు మొహమ్మద్ యూసుఫ్ తరిగామీ పోటీ చేసిన చోటనే బరిలోకి దిగింది అని గుర్తుచేసారు. ‘‘వాళ్ళ లక్ష్యం తరిగామీని ఓడించడం. బీజేపీ లక్ష్యం కూడా అదే. అందుకే బీజేపీ-అతివాదులు పొత్తు కుదుర్చుకున్నారు. అయినా ప్రజలు తరిగామీనే ఎంచుకున్నారు’’ అని పినరయి విజయన్ అన్నారు.
జమాతే ఇస్లామీ కశ్మీర్‌లో ఓ మాట, వయనాడ్‌లో మరోమాటా చెబుతోందంటూ ఆ సంస్థపై పినరయి మండిపడ్డారు. ‘‘ఏదేమైనా, మౌలికంగా వారి సిద్ధాంతం ఒకటే. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏ రూపంలోనూ అంగీకరించరు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌కు మద్దతు ఇస్తున్నారు’’ అని విజయన్ మండిపడ్డారు.
కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న విజయన్, ‘‘లౌకికవాదం కోసం నిలబడిన వ్యక్తులు వేర్పాటువాదాన్ని అన్ని రూపాల్లోనూ వ్యతిరేకించాలి కదా’’ అని అడిగారు. ‘‘కాంగ్రెస్ ఆ పని చేయగలదా? కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, ప్రధానంగా ముస్లింలీగ్, కొన్ని త్యాగాలు చేసైనా సరే జమాతే ఇస్లామీతో పొత్తు కొనసాగిస్తున్నాయి. జమాతే ఓట్లను కాంగ్రెస్ తిరస్కరించగలదా?’’ అని నిలదీసారు.
వయనాడ్‌లో సిపిఐ తరఫున పోటీ చేస్తున్న సత్యన్ మోకేరికి మద్దతుగా ప్రచారం చేసినప్పుడు కూడా విజయన్ ఇలాంటి ఆరోపణలే చేసారు. అక్కడ బీజేపీ తరఫున, కోళికోడ్ కార్పొరేషన్ కౌన్సిలర్ నవ్య హరిదాస్ పోటీ పడుతున్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయబరేలీ, వయనాడ్ రెండుచోట్లా పోటీచేసి రెండుచోట్లా గెలిచారు. ఆయన వయనాడ్ సీటును వదులుకోవడంతో అక్కడ నవంబర్ 13న ఉపయెన్నిక జరగనుంది.