బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య తెలంగాణలో సంచలనంగా మారింది. నల్గొండ జిల్లా
డిండి డీసీసీ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తోన్న సయ్యద్ ఖాదర్ పాషా శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి వస్తానంటూ అటెండరుకు చెప్పి వెళ్లాడు. ఎంతకూ రాకపోవడం, ఫోను కూడా ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎంతకూ ఆచూకీ లేకపోవడంతో వెతకడం ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దేవరకొండకు చెందిన సయ్యద్ పాషా డిండి డీసీసీ బ్యాంకు మేనేజరుగా చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో బ్యాంకు సిబ్బంది, కుటుంబసభ్యులు వెతకగా డిండి రిజర్వాయరు వద్ద అతని బైకు కనిపించింది. చెప్పులు కళ్లజోడు అక్కడే కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు గజఈతగాళ్లతో డిండి రిజర్వాయరులో గాలించగా పాషా మృతదేహం లభించింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
పాషా మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సమస్యలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాషాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.