అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. ఆ కుట్రను భగ్నం చేసినట్లు వెల్లడించింది. కుట్రకు సంబంధించిన వివరాలను అమెరికా న్యాయ విభాగం మీడియాకు వెల్లడించింది. ఇరాన్ కుట్రపై అమెరికాలోని మన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఎఫ్బిఐ అభియోగాలు నమోదు చేసింది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన ఓ అధికారి పేరు కూడా అభియోగాల్లో చేర్చారు. మరో వ్యక్తి ఫర్జాద్ షకేరీ పేరు కూడా చేర్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ తరవాత జరిగిన హత్య కుట్రలను ఎఫ్బిఐ భగ్నం చేసింది.