భూమి హక్కులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడడానికి అని వామపక్ష భావజాలం నుండి స్ఫూర్తి పొంది, తీవ్రవాద భావజాలంతో 1970-80లలో నక్సల్ ఉద్యమం ఊపు అందుకుంది. భారతదేశ రాజ్యాంగంపై గౌరవం లేదంటూ, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని అరణ్యప్రాంతాల్లోనూ, వాటికి దగ్గర ఉండే గ్రామీణ ప్రాంతాలలోనూ వారు దశాబ్దాల పాటు సమాంతర ప్రభుత్వం నడిపారు. తమ హింసామార్గం తో సామాన్య ప్రజలను భయపెడుతూ వారిని గుప్పెట్లో పెట్టుకున్నారు.
నక్సలైట్లు తమకు బాగా పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వాలచే ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు వేయడం గానీ, విద్యుత్ స్తంభాలు లైన్లు వేయడం గానీ, స్కూల్స్ ఆసుపత్రులు మొదలగునవి కట్టడం వంటి పనులు ఏవీ జరగకుండా అడ్డుకునేవారు. ఇంజినీర్లను, పనివాళ్ళను అడ్డుకోవడం లేదా చెరపట్టడం, యంత్రసామగ్రినీ, పరికరాలనూ ధ్వంసం చేయడం లేదా తగులబెట్టడం చేస్తూ వుండేవారు.
అయితే, గత మూడు దశాబ్దాలలో నక్సల్ సిద్దాంతం ఎంత గొప్పదో అది సామాన్య ప్రజలకు ఎలా మేలు చేస్తోందో, హక్కులపై ఎలా పోరాటాలు చేస్తోందో అని చూపిస్తూ వారిని హీరోలుగా చిత్రీకరిస్తూ బోలెడు సినిమాలు చాలా భాషల్లో వచ్చాయి. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో అయితే ఈ సబ్జెక్టు ఆధారంగా నక్సలైట్లను హీరోలుగా చిత్రీకరిస్తూ అనేక సినిమాలు వచ్చాయి.
కానీ, నాణానికి రెండో వైపు ఉన్నట్లే ఇదే నక్సల్స్ తమ మాట వినని గ్రామీణులను బెదిరించడం, కొందరిని ఇన్ఫార్మర్స్గా గుర్తించి ఏ విచారణా లేకుండా వాళ్లే శిక్షలు విధించి చంపేయడం, వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను బెదిరించి బలవంతపు చందాలు వసూలు చేయడం, ఉద్యమంలోకి వచ్చినవారు ఆ పద్ధతులు నచ్చక తిరిగి సాధారణ జన స్రవంతిలోకి వెళ్ళిపోతామంటే బెదిరించి అడ్డగించడం, ఉద్యమంలోకి వచ్చిన యువతులను వేధింపులకు గురిచేయడం వంటి పలు ఆరోపణలు నక్సలైట్ల మీద ఉన్నాయి.
ముఖ్యంగా సమానత్వం, హక్కులు అంటూ 24 గంటలూ చెప్పే ఇదే నక్సల్స్ తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వ్యక్తులను భౌతికంగా అంతం చేయడం అనేది ముఖ్య కార్యక్రమంగా పెట్టుకుని కొన్ని వందల మంది దారుణ హత్యలకు కారకులుగా నిలిచారు. అలాంటి నక్సల్స్ సిద్ధాంతానికి, వారి హింసా మార్గానికీ వ్యతిరేకంగా గళం ఎత్తి పోరాటం చేసి ఆ క్రమంలో అసువులు బాసిన ఒక దేశ భక్త విద్యార్థి నాయకుడు “జితేందర్ రెడ్డి”.
ఈ జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి హిట్ సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వంలో, రాకేష్ వర్రే కథానాయకుడిగా రూపొందిన “జితేందర్ రెడ్డి” సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది.
ఇంతకీ ఎవరీ జితేందర్ రెడ్డి?
పూర్వపు కరీంనగర్ జిల్లాలో జగిత్యాలలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ యువకుడు. వారి కుటుంబానికి మొదటినుండీ దేశభక్తి, హిందూధర్మ రక్షణ ప్రేరేపించే ఆర్ఎస్ఎస్ సంస్థతో చక్కటి సంబంధాలు ఉన్నాయి. అటువంటి వాతావరణం లో పెరిగిన జితేంద్రకు విద్యార్థిగా స్కూల్లోనూ కాలేజీలోనూ ఈ నక్సల్ సిద్ధాంత ప్రభావం గలవాళ్ళు తారసపడటారు. భూమి హక్కులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడడానికి అని మొదలైన నక్సల్స్ తమ అసలు కారణం నుండి దారి తప్పుకున్నారని గ్రహించిన జితేందర్, వారిని ఎదిరించడం మొదలుపెడతాడు. నక్సలిజం వైపు వెళ్ళవద్దు, భవిష్యత్ పాడుచేసుకోవద్దు అంటూ విద్యార్థులను యువతను చైతన్యపరుస్తూ ఉంటాడు.
ఈ సినిమాలో మొదటి భాగం జితేందర్ రెడ్డి బాల్యం, కాలేజీలో అప్పటికే బాగా బలంగా ఉన్న నక్సల్ ప్రభావిత PDSU విద్యార్థి యూనియన్ను ఎదిరించి ABVP విద్యార్థి నాయకుడిగా ఎలా ఎదిగి కాలేజి ఎన్నికల్లో ఎలా గెలిచాడు వంటి అంశాలు చాలా చక్కగా చూపించారు.
రెండో భాగంలో జితేందర్ రెడ్డి వర్గం, నక్సల్స్ మధ్య తరచూ ఘర్షణలు, తమ ఉద్యమ వ్యాప్తికి అడ్డు తగులుతున్నారని జితేందర్ రెడ్డి వర్గం విద్యార్థులను వరుసగా నక్సల్స్ దారుణంగా చంపడం, జితేందర్ రెడ్డి రాజకీయ ప్రవేశం, సీనియర్ ఎన్టీఆర్‌ను కలవడం, వరంగల్‌లో అప్పట్లో వాజపేయి బహిరంగ సభ నిర్వహించడం వంటి పలు అంశాలు చూపించారు.
ఈ ఒక్క యువకుడు జితేందర్ రెడ్డి అంటే ఆ కాలంలో ఆ ప్రాంతంలో నక్సల్స్ ఎంత భయపడి అతని మీద ద్వేషం పెంచుకున్నారు అనేది అతని హత్య నిరూపిస్తుంది. ఒక వ్యక్తిని చంపడానికి సరిగ్గా పేలిస్తే ఒక బులెట్ సరిపోయే దానికి, మళ్ళీ ఎక్కడ బ్రతికి తమకు ఏకుమేకవుతాడో అనే భయంతోనో ఏమో, జితేందర్ రెడ్డి పై 72 బులెట్లు వర్షంలా కురిపించి అతని శరీరాన్ని జల్లెడ చేసారంటే వారిలో అతనెంత వణుకు పుట్టించాడో అర్ధమవుతుంది.
తరచుగా వామపక్ష, ఉదారవాద భావజాలంతో నిండిపోయిన కథనాలను పెద్ద తెరపై చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా రెండోవైపు కోణం చూపించే ప్రయత్నం నిజాయితీగా చేసింది. ఇప్పటివరకూ తెలుగు సినిమా నక్సలైట్లను పాజిటివ్‌గా మాత్రమే చిత్రీకరిస్తే, నక్సలిజంలోని చీకటి వాస్తవాలను ఆవిష్కరించడంలో ఈ జితేందర్ రెడ్డి సినిమా సాహసోపేతమైన ప్రయత్నం చేసింది.
జితేందర్ రెడ్డి పాత్ర చేసిన రాకేష్ వర్రే చాలా బాగా చేసాడు. అందరూ దయచేసి థియేటర్‌కి వెళ్ళి చూసి ఈ సినిమాను ప్రోత్సహించండి. జాతీయభావజాలం, దేశభక్తి కల అందరికి ఈ సినిమా నచ్చుతుంది. క్లైమాక్స్ తప్పక కంటతడి పెట్టిస్తుంది.