సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆఖరిరోజున విధులు నిర్వహించిన జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, వీడ్కోలు సమావేశంలో నవ్వులు పూయించారు. కోర్టు రిజిస్ట్రార్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రేపటి నుంచి సర్వోన్నత న్యాయస్థానం వేదికగా తీర్పులు చెప్పలేని మాట ఎంత వాస్తవమో వృత్తి జీవితం పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నది అంతే నిజం అన్నారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్, 2022 నవంబర్ 9న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేటితో ఆయన సీజేఐగా బాధ్యతలు చేపట్టి రెండేళ్ళు కావడంతో పదవీకాలం పూర్తి అయింది. వీడ్కోలు సమావేశం సందర్భంగా ఆయన ఓ సరదా సంభాషణను గుర్తు చేసుకున్నారు. వీడ్కోలు సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలని రిజిస్ట్రార్ కోరగా శుక్రవారం మధ్యాహ్నం రెండుగంటలకు అని చెప్పినట్లు చెప్పారు. పోగొట్టుకున్న పలు వస్తువులు వెతికి మూటగట్టుకునేందుకు ఈ సమయాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. సమర్థుడైన జస్టిస్ సంజీవ్ ఖన్నా చేతుల్లో ధర్మాసనాన్ని విడిచిపెట్టడం తనకు సంతోషంగా ఉందన్నారు. విధుల్లో భాగంగా కోర్టులో ఎవరినైనా బాధపెట్టి ఉంటే మన్నించాలని కోరారు. ఈ సందర్భంగా ఓ జైన పదబంధాన్ని ఆయన ఉపయోగించారు.
వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది,న్యాయవ్యవస్థలో చంద్రచూడ్ ‘రాక్ స్టార్’ అని కొనియాడారు.
చంద్రచూడ్ వారసుడిగా ఎన్నికైన జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ, ప్రతీ సమావేశంలో చంద్రచూడ్ తమకు సమోసాలు వడ్డేంచేవారని సరదగా వ్యాఖ్యానించారు. అది ఆయనకు సమోసాలు పట్ట అభిమానం అంటూ హస్యమాడారు.
చంద్రచూడ్ హయాంలో సుప్రీంకోర్టు లో పలు సంస్కరణలు జరిగాయి. ప్రత్యేక అవసరాల సిబ్బందికి సౌకర్యాల కల్పన, మహిళల కోసం ప్రత్యేక బార్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కోర్టు ఆవరణలో సుందరీకరణ పనులు మెరుగుపడ్డాయి.
చంద్రచూడ్ తన రెండేళ్ళ పదవీకాలంలో పలు చరిత్రాత్మక తీర్పులు చెప్పారు. ఆర్టికల్ 370 పునరుద్దరణపై దాఖలైన పిటీషన్ల విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. అలాగే త్వరగా జమ్ముకశ్మీర్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐ తీరును తప్పబట్టిన చంద్రచూడ్, స్వలింగ వివాహాల విషయంలో నమోదైన పిటీషన్లపై కీలక తీర్పు చెప్పారు.