ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్దమైంది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి ఉచితంగా ఇవ్వడంతోపాటు, కొత్తగా పెళ్లైన జంటలకు కార్డులు మంజూరు చేయనున్నారు. కొత్త కార్డులు క్యూఆర్ కోడ్‌తో ఉంటాయి. రైస్ ఏటీఎంల వద్ద కూడా పనిచేసే విధంగా డిజైన్ చేసినట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న రేషన్‌కార్డులపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మ ఉండటంతో ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఒడిషా మాదిరి రైస్ ఏటీఎంలు పెట్టే ఆలోచనలో ఉంది. డీలర్ల వద్ద బియ్యం కోసం గంటల తరబడి వేచి చూసే పనిలేకుండా రైస్ ఏటీఎంల ద్వారా వెంటనే తీసుకునే వీలుకలుగుతుంది.
ఏపీలో మొత్తం కోటిన్నర వైట్ రేషన్ కార్డులున్నాయి. వీటి ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ బియ్యం వల్ల ఐరన్ లోపాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు.కొత్తగా రేషన్ దుకాణాల ద్వారా మరికొన్ని నిత్యావసరాలు అందివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే అందిస్తోన్న బియ్యం, పంచదార, కందిపప్పుతోపాటు మరో 15 నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది.