కాంగ్రెస్ పాలిత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఓ విచిత్రం జరిగింది. దాని అంతు తేల్చడానికి స్వయానా సీఐడీయే రంగంలోకి దిగింది. ఏమిటా విషయం అంటారా? సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సమోసాలు, కేక్ ఎవరో తినేసారు. ఓ చిన్న పొరపాటు కాస్తా పెద్ద వివాదమై కూచుంది. సీఐడీ ఆ దోషులను కనిపెట్టేసింది. అయితే ఆ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
హిమాచల్ సీఐడీ, ఈ వ్యవహారంలో ఒక మహిళా ఇనస్పెక్టర్ సహా ఐదుగురు పోలీసు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. వారు బాధ్యతారహితంగా ప్రవర్తించారని నిర్ధారించింది. అంతే కాదు, వారి చర్య ప్రభుత్వ వ్యతిరేకం అని కూడా తేల్చేసింది. ఆ వ్యవహారంపై దర్యాప్తు చేసిన డీఎస్పీ తన నివేదికను సీఐడీ విభాగం ఐజీకి అక్టోబర్ 25న సమర్పించారు. నిందితులు ఐదుగురిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసారు.
ఈ సంఘటన అక్టోబర్ 21న హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ సిఐడి ప్రధాన కార్యాలయంలో సైబర్ వింగ్ స్టేషన్‌ను ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ అక్కడికి వెళ్ళారు. సీఎంకు స్నాక్స్ సర్వ్ చేయలేదని తెలిసిన ఐజీ స్థాయి అధికారి ఒకరు, రాడిసన్ బ్లూ అనే ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి మూడు బాక్సుల సమోసాలు, కేకులు తీసుకురమ్మని ఒక సబ్-ఇనస్పెక్టర్‌ను ఆదేశించారు. అయితే, ఆ పదార్ధాలను తీసుకొచ్చాక, వాటిని ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి వడ్డించారు. వారు తమకు ఇచ్చిన స్నాక్స్ తినేసారు.
ముఖ్యమంత్రికి స్నాక్స్ వెళ్ళలేదని తెలియడంతో ఆ వ్యవహారం మీద సిఐడి దర్యాప్తు చేసింది. డిఎస్పి విక్రమ్ చౌహాన్ దర్యాప్తు నివేదికలో మిగతా వివరాలు ఈవిధంగా తెలియజేసారు…
ఐజీ ఆదేశాలను సబ్ ఇనస్పెక్టర్ తన క్రింది అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్లకు బదలాయించారు. వారు రాడిసన్ బ్లూ హోటల్ నుంచి సమోసాలు, కేకులు మూడు సీల్డ్ బాక్సుల్లో తీసుకొచ్చి ఆ విషయాన్ని ఎస్ఐకి తెలియజేసారు.
డీఎస్పీ విచారించిన ఐదుగురు అధికారుల్లో ఇద్దరు, ఆ శ్నాక్స్ ముఖ్యమంత్రి మెనూలో లేవని తమకు తెలిసిందని చెప్పారు. సాధారణంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలకు స్నాక్స్ సరఫరా చేసే పర్యాటక విభాగానికి చెందిన ఉద్యోగులను వారు ప్రశ్నించినప్పుడు ఆ విషయం తమకు తెలిసిందని వారు వివరించారు. అదే విషయాన్ని వారు సబ్ ఇనస్పెక్టర్‌కు చెప్పినట్టు తెలియజేసారు. దాంతో, ఆ మూడు బాక్సులూ ముఖ్యమంత్రికి ఉద్దేశించినవి అన్న సంగతి తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎస్ఐ అని తేలింది.
ఆ బాక్సులు అందుకున్న మహిళా ఇనస్పెక్టర్ తన పై అధికారులను సంప్రదించకుండా ఆ బాక్సులను మెకానికల్ ట్రాన్స్పోర్ట్ యూనిట్‌కు అందజేసింది. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు రిఫ్రెష్మెంట్స్ అందజేసే బాధ్యత ఆ యూనిట్‌దే. ఆ విభాగానికి చెందిన ఒక అధికారి, ఐజీ కార్యాలయంలో ఉన్న ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి ఆ శ్నాక్స్ అందజేయాలని తనకు ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పాడు. దాంతో ఆ సమోసాలు, కేకులు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి అందజేసారు. వారు వాటిని తినేసారు. అదీ జరిగిన కథ.
సీఐడీ ఉన్నతాధికారులు ఆ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. నిందితులైన ఐదుగురూ సీఐడీకి, ప్రభుత్వానికీ వ్యతిరేకంగా వ్యవహరించారని వారిపై ఆరోపణలు మోపారు. వారి దురుద్దేశంతో కూడిన చర్యల వల్లనే వీఐపీలకు శ్నాక్స్ అందలేదని నిర్ధారించారు. నిందితులు తమ సొంత అజెండాతో పనిచేసారని ఆరోపించారు. అలా, ముఖ్యమంత్రికి ఉద్దేశించిన శ్నాక్స్ను వేరొకరికి వడ్డించడం వెనుక ఆ నిందితుల దురుద్దేశాలేమిటో తెలుసుకోవడం అవసరమని సీఐడీ ఉన్నతాధికారులు భావించారు. దాంతో ఈ వ్యవహారంపై తదుపరి విచారణకు ఆదేశించారు.