కర్ణాటకలోని విజయపురలో వక్ఫ్ బోర్డ్ భూముల ఆక్రమణ వ్యవహారం మీద ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నిజ నిర్ధారణ కమిటీ తమ నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్‌కు గురువారం నాడు సమర్పించింది.
బీజేపీ ఎంపీ గోవింద్ ఎం కార్జోల్ నేతృత్వంలోని ఆ కమిటీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల గురించి వివరించింది. ప్రజలకు ఎలాంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా వారి భూముల రికార్డులను తారుమారు చేసేసిన సందర్భాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయని తమ నిజనిర్ధారణలో తేలినట్లు కమిటీ స్పష్టం చేసింది.
‘‘కాలం చెల్లిపోయిన వక్ఫ్ బోర్డ్ ఆదేశాల ఆధారంగా, డిప్యూటీ కమిషనర్లు నోటిమాటగా జారీ చేసిన ఆదేశాల మేరకు భూముల రికార్డులను మార్చేసిన సంఘటనలు చాలావాటిని మా కమిటీ బహిర్గతం చేసింది’’ అని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప తన ఎక్స్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసారు.
విజయపుర జిల్లా ఇండీ, చడాచన్ తాలూకాల్లో సరైన నోటిఫికేషన్ లేకుండానే 44 ఆస్తులకు సంబంధించిన భూముల రికార్డులను వక్ఫ్ భూములుగా ప్రకటించేసారని బీజేపీ ఆరోపించింది. జిల్లా అధికారులు రాష్ట్ర మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌తో సమావేశం తర్వాతనే అటువంటి తీవ్రమైన చర్యకు పాల్పడ్డారని వివరించింది.
అయితే, రైతులకు నోటీసులు ఇవ్వడం ఆపివేయాలనీ, ఇప్పటికే జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలనీ అధికారులకు తాను సూచించానని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అభ్యర్ధన మేరకు జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ విజయపుర ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ రైతులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆందోళనకారుల సమస్యలను తాను విన్నానని, అర్ధం చేసుకున్నాననీ జగదాంబికా పాల్ చెప్పారు.
‘‘కర్ణాటకలోని విజయపురలో రైతులు, ప్రజాప్రతినిథులు, సాధుసంతులు వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉమ్మడి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాను. వారి సమస్యలు తెలుసుకున్నాను’’ అని జగదంబికా పాల్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘రైతులు మమ్మల్ని కలిసారు. అక్కడ తాము వందల యేళ్ళుగా వ్యవసాయం చేసుకుంటున్నామని, తమవద్ద భూమి పట్టాలు ఉన్నాయనీ, అయితే ఇప్పుడు తమకు వక్ఫ్ బోర్డు నుంచి నోటీసులు వస్తున్నాయని చెప్పారు. తమను రక్షించాలంటూ మెమొరాండం సమర్పించారు’’ అని జగదాంబికా పాల్ చెప్పారు.
జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్, కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, బీజేపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు అందరూ కలిసి హుబ్బళ్ళి, విజయపుర జిల్లాల్లో పలు ప్రదేశాల్లో పర్యటించారు. 80కి పైగా రైతు సంఘాలకు చెందిన 5వేలకు పైగా రైతులతో సమావేశమయ్యారు.
బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ఆర్ పాటిల్ ఒకడుగు ముందుకేసి, వక్ఫ్ ఆస్తులను జాతీయం చేయాలని, వాటిని జాతి ఆస్తులుగా ప్రకటించాలనీ డిమాండ్ చేసారు.