అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి సంబంధించిన మైనార్టీ హోదా విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అలీగఢ్ ముస్లిం వర్సిటీని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిన తీర్పును ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే మైనార్టీ హోదా ఉండాలా? లేదా అనే అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం 4:3 మెజార్టీతో తీర్పు చెప్పింది.
1967లో అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని కేంద్ర వర్సిటీగా పేర్కొంటూ అప్పట్లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. మైనారిటీ విద్యాసంస్థగా పరిగణించలేమని తీర్పులో పేర్కొంది.
1981లో ఏఎంయూ సవరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం లభించడంతో ఈ విద్యాసంస్థకు మళ్లీ మైనార్టీ హోదా దక్కింది. ఈ చట్ట సవరణను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, ఏఎంయూ కు మైనార్టీ హోదా కల్పించే 1981 చట్ట నిబంధనను కొట్టివేస్తూ 2006 జనవరిలో తీర్పు వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరుకుంది.
తాజాగా ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం, 1967 నాటి ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును తోసిపుచ్చింది. 2006 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పు చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునేందుకు కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. 1875లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీగా ప్రారంభమైన విద్యాసంస్థ, 1920లో యూనివర్సిటీగా మార్చారు.