ది హిందూ స్పిరిచ్యువల్ అండ్ సర్వీస్ ఫౌండేషన్ హైదరాబాద్ శాఖ వార్షిక సేవా ప్రదర్శిని కార్యక్రమం గురువారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వైభవంగా ప్రారంభమైంది. నవంబర్ 8, 9, 10 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉండే ఆధ్యాత్మిక, సమాజసేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తిగతంగా సేవ చేసే కార్యకర్తలూ పాల్గొంటున్నారు.
సేవా ప్రదర్శినిని ప్రారంభించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఈ కార్యక్రమం స్ఫూర్తిని అభినందించారు. ‘‘ఈ గొప్ప సమావేశం భారతీయ స్ఫూర్తిని ప్రతిఫలిస్తోంది. మనదేశానికి ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉంది. దానికి ఈ ప్రదర్శనే నిదర్శనం’’ అన్నారు. భారతీయ విలువల గాఢతను, ఔన్నత్యాన్నీ చాటే ప్రదర్శనను ప్రోత్సహించి చేయూతనివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. వర్తమాన భారతీయ విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళను ఆయన ప్రస్తావించారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్ళయినా దశా దిశా లేని విద్యావ్యవస్థ కొనసాగుతోంది. స్వీయాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ రేకెత్తించడంలో మన చదువులు విఫలమవుతున్నాయి’’ అని ఆవేదన . ‘‘వైదిక విజ్ఞానానికి ఆలవాలమైన భారత్ సహజంగానే గొప్ప వనరులు కలిగి ఉంది, ఇక్కడ సౌందర్యానికి, అభిరుచికి, నాణ్యతకూ లోటు లేదు. అవన్నీ ఈ ప్రదర్శినిలో కనిపిస్తున్నాయి’’ అని స్వామి అభినందించారు.
విజయవాడ రామకృష్ణా మిషన్‌కు చెందిన శ్రీ స్థితికంఠానంద స్వామి ఈ కార్యక్రమం ‘సేవ’ను ప్రధాన లక్ష్యంగా చేసుకోవడాన్ని అభినందించారు. మానవత్వం నుంచి దైవత్వాన్ని చేరుకోడానికి సేవే మార్గమని మన ఋషులు మనకు మార్గదర్శనం చేసారని ఆయన వివరించారు. సనాతన ధర్మంలోని దధీచి, శిబి, రంతిదేవుడు వంటి మహానుభావులు నిస్వార్థంగా చేసిన త్యాగాల వెనుక ఉన్న సేవానిరతిని వివరించారు. వ్యక్తి తన అహాన్ని తొలగించుకోడానికి సేవ ఎంతో ఉపయోగపడుతుందని స్వామి రంగనాథానంద చెప్పిన విషయాన్ని గుర్తుచేసారు. ఏ గుర్తింపూ కోరుకోకుండా సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులు, సంస్థలను ఈ ప్రదర్శన వెలుగులోకి తెస్తోందని అభినందించారు. సేవా ప్రదర్శినిలో భాగంగా నిర్వహిస్తున్న కన్యావందనం, గురువందనం, మాతృ-పితృ వందనం వంటి కార్యక్రమాలను ప్రశంసించారు.
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భాగయ్య తన ప్రసంగంలో భారతీయ సమాజపు మౌలిక విలువల ఘనతను వివరించారు. సేవా ప్రదర్శిని భారతదేశపు మౌలిక స్వభావానికి, సాంస్కృతిక తత్వానికి, ఆత్మవిశ్వాసానికీ నిజమైన ప్రతీకగా ఉందన్నారు. కృష్ణుడి బోధనల నుంచి ప్రేరణ పొందిన, ఆయన వారసులైన భారతీయులు ఈ దేశపు ధార్మిక కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పారు. ‘‘బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశానికి పేదరికం అంటే తెలీదు. విదేశీ దండయాత్రల సమయంలో కూడా మన గ్రామాలు స్వయంసమృద్ధంగా ఉండేవి’’ అని గుర్తు చేసారు. ‘‘1785 వరకూ తమిళనాడు, బరంపురంలలో లక్షకు పైగా పాఠశాలలు ఉండేవి. వాటిలో అన్ని కులాల విద్యార్ధులూ కలిసి చదువుకునేవారు’’ అన్న సంగతిని ఆయన గుర్తు చేసారు. రామకృష్ణ మఠం, సత్యసాయి సంస్థలు, మాతా అమృతానందమయి మఠం, సేవాభారతి వంటి సంస్థలు చేస్తున్న సేవలను కొనియాడారు. ‘‘భారతీయుల సేవాస్ఫూర్తి భారతేశానికి మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా నుంచి కెన్యా వరకూ పలు దేశాల్లో భారతీయుల సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వాటిని ఈ సేవాప్రదర్శినిలో తెలుసుకోవచ్చు’’ అని భాగయ్య వివరించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, భారతదేశపు నిజమైన చరిత్ర గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడం గురించి ఆందోళన వ్యక్తం చేసారు. ‘‘మన దేశపు పౌరులుగా పుట్టినా, మనవారికి మనదేశపు నిజమైన చరిత్ర గురించి కనీస అవగాహనే లేదు. నిస్వార్థ సేవ చేసే వ్యక్తులు, సంస్థలను ఒకచోట చేర్చి చూపించడం ద్వారా మన నిజమైన పౌరసత్వానికి సేవా ప్రదర్శిని ప్రాతినిధ్యం వహిస్తోంది’’ అంటూ సేవా ప్రదర్శిని సాధిస్తున్న లక్ష్యాన్ని ప్రశంసించారు.
సేవా ప్రదర్శిని ఎగ్జిబిషన్‌ను రోజుకు 5వేల మంది విద్యార్ధులు, వారిని తీసుకొచ్చే సుమారు వెయ్యిమంది పాఠశాల యాజమాన్యాల ప్రతినిథులూ సందర్శిస్తారని అంచనా. ఈ ఎగ్జిబిషన్లో 150కి పైగా ఆధ్యాత్మిక, సమాజసేవా సంస్థలు పాల్గొంటున్నాయి, సమాజానికి తాము అందిస్తున్న సేవల గురించి వివరిస్తున్నాయి. వాటిని ప్రధానంగా ఆరు విభాగాలుగా విభజించారు. అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ సుస్థిరత, కుటుంబ విలువలు, మహిళా గౌరవం, దేశభక్తి. భారతీయతను అనుసరిస్తూ, ప్రపంచ సంక్షేమం కోసం పాటుపడే సంస్థలను ఏకత్రితం చేయడం, సమాజపు అవసరాలకు-సేవాసంస్థలకూ నడుమ ఖాళీని పూరించడం ఈ ప్రదర్శన ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.