ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 ఆతిధ్య హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బీసీసీఐ ఒత్తిడికి తలగ్గొంది. భారత్ ఆడే మ్యాచ్ లు యూఏఈలో నిర్వహించేందుకు సుముఖత తెలిపింది. మార్చి 1న లాహోర్లో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్, మార్చి 9న లోహార్ లోనే ఫైనల్ మ్యాచ్ నిర్వహించేలా తొలుత పీసీబీ తాత్కాలిక షెడ్యూల్ రూపొందించింది.
అయితే భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే పాకిస్తాన్ లో తమ టీమ్ పర్యటన ఉంటుందని బీసీసీఐ తెలిపింది. టోర్నీలో భారత్ ఆడకపోతే తీవ్రంగా నష్టపోతామని భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, షెడ్యూల్లో స్వల్ప మార్పులకు సిద్ధమైంది. భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈలోని దుబాయ్, షార్జాలో నిర్వహించేందుకు అంగీకరించినట్లు పీటీఐ వార్త కథనంలో వెల్లడించింది.
టోర్నీని హైబ్రీడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఐసీసీ ముందుగానే చర్యలు తీసుకుంది. అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించింది. అసియా కప్-2023 పాకిస్తాన్ వేదికగా జరగగా , హైబ్రిడ్ విధానం అనుసరించి భారత్ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించారు.