అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణించిందంటూ వ్యాపించిన వదంతులపై నాసా స్పందించింది. సునీతా విలియన్స్ బరువు తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లు గా ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోషకాహార లోపంతో బాధపడుతూ బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా అన్నారు. దీంతో నాసా స్పందించింది.
సునీతా విలియమ్స్ సహా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. వ్యోమగాములకు తరుచూ వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తారని వివరించింది.
స్పేస్ మిషన్‌లో భాగంగా వ్యోమగాములు సునీత , విల్మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాల్సి వస్తోంది.
అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉండటంతో ఎనీమియా వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. మైక్రో గ్రావిటీకి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్రరక్తకణాల ఉత్పత్తితో పోలిస్తే క్షీణించే రేటు ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. ఫలితంగా రకరకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.