మీడియా ఎదుట ప్రజా సమస్యలు ప్రస్తావిస్తామని వెల్లడి
శాసనసభలో ప్రతిపక్షనేతకు మైక్ ఇస్తేనే ప్రజాసమస్యలు చెప్పే అవకాశం ఉంటుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో తమకు మైక్ ఇస్తే ప్రజా సమస్యలపై నిలదీస్తామని పాలకపార్టీ భయపడుతోందన్నారు. తాడేపల్లిలో గురువారం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ఎన్నికల్లో 40 శాతం ఓట్లు సాధించిన పార్టీని ప్రతిపక్షంగా గుర్తించరా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చెప్పనీయకుండా ఉండేందుకే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వనప్పుడు శాసనసభకు వెళ్లి ఏం ఉపయోగం అన్నారు. ‘‘ఇక నుంచి మీరే నా స్పీకర్లు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకొచ్చి ప్రజాసమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తానమన్నారు.
ఈ నెల 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న మూడో అసెంబ్లీ సమావేశాలు ఇవి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూసింది. కూటమి రికార్డు మెజార్టీతో ఘన విజయాన్ని అందుకుంది. వైసీపీ 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో తొలి సమావేశాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు.
ఇక ఆ తర్వాత జరిగిన రెండో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదంటూ వైసీపీ సభ్యులు సమావేశాలకు డుమ్మా కొట్టారు.