అంతర్జాతీయ అస్థిర పరిస్థితుల వేళ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగిపోకుండా ఆపడం సాధ్యమయిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ చెప్పారు.
అబూధాబీలో జరుగుతున్న వార్షిక ఇంధన పరిశ్రమల సమావేశానికి హాజరైన మంత్రి, అమెరికన్ వార్తాసంస్థ సిఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారత ప్రభుత్వం రష్యన్ చమురు కొనకపోయి ఉంటే అంతర్జాతీయంగా చమురు ధరలు 200 డాలర్ల కంటె ఎక్కువకు పెరిగిపోయి ఉండేదని వివరించారు.
‘‘చమురు ధరలు తగ్గుతాయని నేను గతంలోనే అంచనా వేసిన సంగతి తెలిసిందే. అది జరిగి తీరుతుందని ఇప్పుడు నేను మరింత ధైర్యంగా చెప్పగలను. 2026 నాటికి విపణిలో ఇంధనం మరింత ఎక్కువ అందుబాటులో ఉంటుంది. చమురు ధరలు మరింత స్థిరీకరణ చెందుతుంది. అందువల్ల ఆ ధరలు మరింత ఎక్కువ తగ్గుతాయి’’ అని పూరీ అంచనా వేసారు.
ఈ యేడాది అక్టోబర్ నుంచి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను సుమారు పదిశాతం తగ్గించింది. దానికి కారణమేంటి అని ప్రశ్నించినప్పుడు, మార్కెట్లో చమురు ధరల పోటీ వల్లనే అని చెప్పారు. ‘‘అదే ధరకు సరఫరా చేయడానికి ఇతరులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చమురు విపణిలో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. మీకు ఒకరి నుంచి ఇంధనం లభించకపోతే, మరొకరి నుంచి లభిస్తుంది’’ అని హర్దీప్ సింగ్ పూరీ వివరించారు.
రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించడం వ్యూహాత్మక నిర్ణయమా అన్న ప్రశ్నకు సమాధానంగా ‘‘చమురు గురించిన నిర్ణయాలు మార్కెట్‌ప్లేస్‌లో తీసుకుంటారు. ఫిబ్రవరి 22 నాడు మార్కెట్లో 13 మిలియన్ బ్యారెళ్ళ రష్యన్ చమురు ఉంది. ఆ చమురంతా మార్కెట్ నుంచి మాయమైపోతే, ఇండియా తన 5మిలియన్ బ్యారెళ్ళను వేరే సరఫరాదారు నుంచి కొనుగోలు చేసి ఉంటే, చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్ల కంటె ఎక్కువస్థాయికి పెరిగిపోతాయి. ఆ విధంగా భారత్ అన్ని దేశాలకూ మేలే చేసింది’’ అని వివరించారు.
రాబోయే ఐదేళ్ళలో ప్రపంచ చమురు డిమాండ్లలో చాలా మార్పు వస్తుందని పూరీ చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్, పరిశుద్ధ ఇంధనం వంటి సాంకేతిక పురోగతులు దానికి కారణమవుతాయన్నారు.
రష్యన్ చమురు దిగుమతుల గురించి పూరీ తన ఎక్స్ ఖాతాలో కూడా వివరించారు. ‘‘రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్, మొత్తం ప్రపంచానికే మేలు చేసింది. భారత్ ఆ పని చేయకపోతే అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్ల మార్కును ఎప్పు డో దాటేసేది. రష్యన్ చమురు మీద ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ లేవు. దాని మీద ధరల మీద నియంత్రణ మాత్రమే ఉంది. ఆ నియమాలను భారత్ అధికారులు స్పష్టంగా అనుసరించారు’’ అని స్పష్టం చేసారు.
కొంతమంది వ్యాఖ్యాతలు సరైన సమాచారం లేకుండానే, భారత్ మీద ఆంక్షలు విధించాలని కోరుకుంటున్నారని హర్దీప్సింగ్ పూరీ చెప్పారు. నిజానికి రష్యా నుంచి యూరోపియన్, ఆసియన్ దేశాలు కూడా గణనీయంగా ఇంధనాన్ని కొనుగోలు చేసాయని గుర్తు చేసారు. ‘‘ఐరోపా, ఆసియా ఖండాలకు చెందిన చాలాదేశాలు రష్యా నుంచి వందల కోట్ల డాలర్ల విలువైన ముడిచమురు, డీజెల్, ఎల్ఎన్జి, రేర్ ఎర్త్ మినరల్స్ వంటివి కొనుగోలు చేసాయి. అది పట్టించుకోకుండా కేవలం భారత్ మీదనే రష్యా నుంచి దిగుమతులు చేసుకున్న కారణానికి ఆంక్షలు విధించాలని కొంతమంది వ్యాఖ్యాతలు ప్రచారం చేస్తున్నారు. మా చమురు కంపెనీలకు ఉత్తమమైన రేట్లు అందించే సంస్థల నుంచి మాత్రమే మేం ఇంధనం కొనుగోలు చేయడాన్ని కొనసాగిస్తాం’’ అని హర్దీప్ పూరీ, తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
‘‘మనకు నిలకడగా చమురు సరఫరాలు కావాలి. అది అందుబాటు ధరల్లో ఉండాలి. ప్రతీరోజూ భారత్‌లోని పెట్రోలు బంకుల్లో 7కోట్లమంది పౌరులు ఇంధనం కొనుగోలు చేస్తారు. అది మాకు టాప్ ప్రయారిటీ. ఇతర దేశాల్లో చమురు ధరలు అనూహ్య స్థాయిలో పెరిగిన గత మూడేళ్ళలో, ఆ ధరలను గణనీయంగా తగ్గిస్తూ వస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమే’’ అని హర్దీప్ పూరీ వివరించారు.
2024లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో చమురు వినియోగించే అతి పెద్ద దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.