జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్‌లోని కిస్తువాడ్ ప్రాంతంలో ఇద్దరు గ్రామరక్షణ సభ్యులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కిస్తువాడ్ సమీపంలో అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదుల కాల్పుల్లో కులదీప్ కుమార్, నజీర్ అహ్మద్ అనే ఇద్దరు గ్రామరక్షణ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
జమ్ముకశ్మీర్‌లో గ్రామరక్షణకు యువతకు ఆర్మీ శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన వారిని గ్రామరక్షణకు నియమిస్తోంది. అలా నియమితులైన వారు ఉగ్రవాదుల కదలికలపై కన్నేసి ఉంచుతారు. గ్రామాల్లో కొత్తవారు కనిపిస్తే వెంటనే ఆర్మీ అధికారులు, పోలీసులకు సమాచారం చేరవేస్తారు. ఇలాంటి వారిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజా హత్యలు జరిగాయని భావిస్తున్నారు