హిందీ సినీనటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ పేరును, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి పేరును కలుపుతూ ఉన్న పాట విషయంలో సల్మాన్‌ను బెదిరిస్తూ కాల్ చేసారు. ఆ ఫోన్ కాల్ గురువారం అర్ధరాత్రి సమయంలో ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు వచ్చింది.
ఇటీవల విడుదలైన ఒక పాటలో సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్ణోయి ఇద్దరి పేర్లూ ఉన్నాయి. ఆ పాట రాసిన రచయితను ఉద్దేశించి ఆ కాల్లో బెదిరించారు. ఆ రచయిత నెల రోజుల్లోగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడని హెచ్చరించారు.
‘‘ఆ గీత రచయిత పరిస్థితి ఎలా ఉంటుందంటే అతను ఇకపై పాటలు రాయలేడు. సల్మాన్ఖానకు దమ్ముంటే ఆ రచయితని రక్షించవచ్చు’’ అని ఆ బెదిరింపు సందేశంలో పేర్కొన్నారు.
ఈమధ్య కొన్నివారాలుగా లారెన్స్ బిష్ణోయి పేరు, అతని సహచరుల పేరుతో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరిస్తున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1998లో కృష్ణజింకలను వేటాడిన సల్మాన్ ఖాన్ మీద బిష్ణోయి తెగ పగపట్టింది. ఆ తెగ ప్రజలు కృష్ణజింకలను దైవంగా భావిస్తారు. దాంతో సల్మాన్ ఖాన్ ఆ తెగవారికి శత్రువయ్యాడు.
తాజాగా మరో సినీనటుడు షారుఖ్ ఖాన్‌కు కూడా బెదిరింపు కాల్ వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ వచ్చిన ఆ కాల్, రాయపూర్‌లోని ఒక ముస్లిం అడ్వొకేట్ ఫైజన్ ఖాన్ ఫోన్ నుంచి వచ్చినట్లు పోలీసులు కనుగొన్నారు. అతన్ని నిన్న గురువారం నాడు ముంబై పోలీసులు రాయపూర్‌లో రెండు గంటల పాటు విచారించారు. అయితే నవంబర్ 2నే తన ఫోన్ పోయిందంటూ ఫైజన్ ఖాన్ స్థానికంగా కేసు పెట్టాడు. ఇప్పుడు తనను కుట్రలో ఇరికిస్తున్నారేమో అని ఫైజన్ అనుమానిస్తున్నాడు.
ఫైజన్ ఖాన్ గతంలో, 1994 నాటి షారుఖ్ ఖాన్ సినిమా అంజామ్‌లో ఒక డైలాగ్ మీద అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఆ డైలాగ్‌లో జింకల వేట గురించిన ప్రస్తావన ఉంటుంది. ‘‘నేను రాజస్థాన్‌కు చెందిన వాడిని. బిష్ణోయి తెగ వారితో నాకు స్నేహం ఉంది. వారి ధర్మం ప్రకారం జింకలను రక్షించాలి. కాబట్టి, జింకల గురించి ఒక ముస్లిం అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. అందుకే ఆ సినిమా డైలాగ్ మీద నేను అభ్యంతరం వ్యక్తం చేసాను’’ అని ఫైజన్ ఖాన్ పోలీసులకు చెప్పాడు.