రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. త్వరలోనే ఎస్సీలను జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ నెల రోజుల్లోనే నివేదిక అందిజేసేలా ఆదేశిస్తామన్నారు. త్వరగా నివేదిక తెప్పించుకోవడం ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఇబ్బంది లేకుండా చూస్తానని, ఎస్సీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. సచివాలయంలో టీడీపీ, జనసేనకు చెందిన 23 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలసి వర్గీకరణపై చర్చించారు.
ఎస్సీ మాదిగలను గతంలో కోరినట్లు ఏ,బీ,సీ,డీ కాకుండా కేవలం ఏ,బీ,సీగా మాత్రమే విభజించాలని దళిత ఎమ్మెల్యేలు కోరారు. డి కేటగిరీలోని ఆది ఆంధ్రా ఎస్సీలు బి,సి కేటగిరీల్లోకి వస్తారని సూచించారు. డీ కేటగిరీ రద్దు చేసేందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండగానే ఎస్సీల వర్గీకరణ చేసి రిజర్వేషన్లు అమలు చేసినట్లు గుర్తుచేశారు. కోర్టు కేసుల కారణంగా తరవాత నిలిచిపోయిందని, తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీల వర్గీకరణకు ఆటంకం లేకుండా పోయిందన్నారు. త్వరలోనే వర్గీకరణ పూర్తి చేసి తమిళనాడు తరహాలో 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభ్యులు కోరారు. ఎస్సీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.