రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు దిగజారిపోతుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, 5 నెలల్లో 100 మందికి పైగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినా ఏ స్పందనా లేదని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మంచీ చెడూ పట్టించుకోకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించాలని వైఎస్ఆర్సిపి నిర్ణయించినట్లు పేర్ని నాని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిందన్న మాజీ మంత్రి, రెండేళ్ల క్రితం 41–ఏ నోటీసులు అందుకున్న కేసులను 307 సెక్షన్ కిందకు మార్చి, అక్రమంగా జైళ్ళకు పంపి వేధిస్తున్నారన్నారు. పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి ప్రైవేట్ సైన్యంలా మారిందని, కిరాతకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కూటమి నాయకుల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా పోలీసులకు లేకుండా పోయిందని ఆరోపించారు. పోస్టింగ్‌ల కోసం చట్టాలను అతిక్రమించి, వైయస్సార్సీపీ ఎస్సార్సీసీ జెండా పట్టినా, ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రశ్నించినా.. అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆక్షేపించారు.
ఈ పరిస్థితుల్లో, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లిందన్నారు. అభ్యర్థులకు ఓట్లడిగే స్వేచ్ఛను కాలరాసేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గెలుపును కూడా ఓటమిగా మార్చే దౌర్జన్య విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికలు బహిష్కరించాలని తమ పార్టీ నిర్ణయించిందని పేర్ని నాని వెల్లడించారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు సహా ఉమ్మడి కృష్ణా, గుంటుూరు జిల్లాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.