అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్నేహితులు అయి ఉండవచ్చు. కానీ ఇరుదేశాల సంబంధాలూ ఎలా ఉండబోతున్నాయి? ప్రత్యేకించి, వాణిజ్య వివాదాలు ముదురుతున్న వేళ భారత్-యుఎస్ బంధం పరిస్థితి ఏంటి? ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు మోదీతో స్నేహం సంగతి ఎలా ఉన్నా, భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ అనీ, ‘ట్రేడ్ అబ్యూజర్’ అనీ నిందించింది ఈ ట్రంపే.
అమెరికాతో వాణిజ్యం ఎక్కువగా ఉన్న దేశాలతో సుంకం విధానాలను పరస్పరం సమానంగా ఉండేలా విధిస్తామని ట్రంప్ చెప్పాడు. అదే సాకారమైతే, ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన భారత్‌లోని పరిశ్రమలకు ఇబ్బందికరమైన పరిస్థితే.
‘‘ట్రంప్ అమెరికాను ఎటు తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో గమనించండి. ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలను తిరిగి అమెరికాకు తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా, ఎక్కడో తయారైన వస్తువులను చవకగా పొందే విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. ఇప్పుడు ఉత్పాదక రంగం అమెరికాకు తరలిపోతుందంటే, ఆ దేశంతో అధిక వాణిజ్యం (ట్రేడ్ సర్‌ప్లస్) ఉన్న దేశాల పరిస్థితి ఏంటి?’’ అని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే అనంత ఆస్పెన్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణీ బాగ్చీ అన్నారు.
అమెరికాకు తొమ్మిదవ పెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ ఉంది. అమెరికాతో భారత వాణిజ్యంలో ట్రేడ్ సర్‌ప్లస్ 30 బిలియన్ డాలర్ల పైమాటే.
ఇటు మోదీ ప్రభుత్వం కూడా ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారం దేశీయంగా ఉత్పాదక రంగం అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. కొత్తగా వస్తున్న కంపెనీలకు అనుకూలంగా సరళమైన చట్టాలు, ఉదారంగా పన్ను మినహాయింపులూ ఇస్తోంది. ఇలాంటి ముందడుగుల ఫలితంగా, చైనాకు ఆవల తమ సరఫరా వ్యవస్థలను విస్తరించాలని ప్రయత్నిస్తున్న యాపిల్ వంటి టెక్ జైంట్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి.
ఇక టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి భారతదేశపు టెక్ జయింట్స్ తమ అమెరికన్ భాగస్వాములకు వారి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవసరాలను ఔట్‌సోర్స్ చేసేందుకు చవకైన మానవ వనరులను సమకూర్చడం ద్వారా కార్పొరేట్ దిగ్గజాలుగా ఎదిగాయి.
అలాంటి ఐటీ ఉద్యోగాలను ఆన్‌షోర్ చేయడం ద్వారా అమెరికాకు వెనక్కి తీసుకొస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ట్రంప్ పట్టుపడితే, అది టారిఫ్ వార్‌కు దారితీస్తుంది, అంతిమంగా భారతీయ టెక్ కంపెనీల మీద ప్రభావం పడుతుంది… అని ‘ది ఏసియా గ్రూప్’ బిజినెస్ కన్సల్టెన్సీకి చెందిన అశోక్ మాలిక్ చెప్పారు.
ట్రంప్ మొదటి దశ వాణిజ్య విధానపు దూకుడు ప్రాథమికంగా చైనాపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఉండవచ్చు, కానీ అది అక్కడితో ఆగదు, భారత్‌ను వదిలిపెట్టదు అని అశోక్ మాలిక్ అభిప్రాయపడ్డారు.
మోదీ-ట్రంప్ బంధం ప్రభావం ఎలా ఉంటుందో?
ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ 2019లో హ్యూస్టన్ స్టేడియంలో కలిసి ఒక సభలో పాల్గొన్నప్పుడు పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. వేలాది భారతీయ అమెరికన్ల ముందు తమ వ్యక్తిగత మిత్రత్వాన్ని ప్రదర్శించారు. ఆ కార్యక్రమానికి 50వేల మందికి పైగా భారతీయులు హాజరయ్యారు. పోప్‌ను మినహాయిస్తే ఒక విదేశీ నాయకుడు పాల్గొన్న అతిపెద్ద కార్యక్రమంగా నిలిచింది ఆ సమావేశం.
దానికి మోదీ మరుసటి యేడాదే బదులు తీర్చేసుకున్నారు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో సుమారు లక్షమంది ప్రజలు పాల్గొనగా, ట్రంప్‌తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
గత నెల ఒక అమెరికన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ట్రంప్ నరేంద్రమోదీని తన స్నేహితుడిగా వర్ణించారు. ‘‘మోదీ తన ప్రజలకు తండ్రిలాంటివాడు. చాలా మంచివాడు. అతని ప్రభావం గొప్పది’’ అని వ్యాఖ్యానించారు.
ఇద్దరు నాయకుల మధ్యా ఉన్న వ్యక్తిగత అనుబంధం భారతదేశానికి లబ్ధి చేకూరుస్తుందని లండన్ కింగ్స్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హర్ష్ వి పంత్ అభిప్రాయపడ్డారు. ‘ట్రంప్‌కు బలమైన నాయకులంటే ఇష్టం. మోదీ కచ్చితంగా అలాంటి నాయకుడే. మోదీతో కలిసి ఉండడం రాజకీయంగా మంచిది, ఇరుదేశాలూ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ పరిస్థితి నుంచి మోదీ ఎంతో సాధించుకోవచ్చు’ అని అంచనా వేసారు.
వలసల సమస్య :
రాబోయే యేళ్ళలో భారత్-అమెరికా సౌభ్రాతృత్వానికి దెబ్బతగులవచ్చు, దౌత్య సంబంధాల్లో ఘర్షణలు తలెత్తవచ్చు. దానికి కారణం వలసలు.
అమెరికాకు చట్టబద్ధంగా వలసవెళ్ళే పౌరులను పెద్దసంఖ్యలో పంపించే దేశాల్లో భారత్ ఒకటి. అదే సమయంలో, వేల సంఖ్యలో భారతీయులు అక్రమంగా ఆ దేశానికి వెడుతున్నారు. కెనడా, మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలోకి చొరబడుతున్నారు.
చట్టవిరుద్ధమైన వలసలను అడ్డుకుని తీరతామని, ఆ సమస్యను పరిష్కరించడాన్ని ఒక విధానంగా అమలు చేస్తామనీ ట్రంప్ తన ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించారు. ‘‘అక్రమ చొరబాటుదారుల్లో భారతీయులను ఏరివేసి, వారిని సామూహికంగా భారత్‌కు వెనక్కి పంపివేస్తే అది ఇరుదేశాల సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది’’ అని ఇంద్రాణీ బాగ్చీ వివరించారు.
మోదీ ప్రభుత్వం అమెరికాతో పలు రంగాల్లో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటోంది. రక్షణ, టెక్నాలజీ, సెమీకండక్టర్ ఉత్పాదన సహా పలు రంగాల్లో భారత్-అమెరికా భాగస్వామ్యాలు అమల్లోకి వస్తున్నాయి.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనాను ప్రాబల్యాన్ని నిలువరించడానికి ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్ అలయెన్స్‌లో భారత్ కూడా భాగస్వామే. అయితే, ట్రంప్ నిర్ణయాలు, కార్యాచరణ అనూహ్యంగా ఉంటాయి. అలాంటప్పుడు భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం ఉన్న సన్నిహిత పరస్పర సహకార సంబంధాలు ఇలాగే కొనసాగుతాయని చెప్పలేం. ‘‘ట్రంప్ ప్రపంచ దేశాలతో సంబంధాలను వ్యూహాత్మకంగా పరిగణించడు, ఒక వ్యవహారాన్ని ఒక వ్యాపార లావాదేవీగానే పరిగణిస్తాడు. అది పరిస్థితులను సంక్లిష్టం చేస్తుంది, కచ్చితత్వం లేని వాతావరణాన్ని సృష్టిస్తుంది’’ అని హర్ష్ వి పంత్ అభిప్రాయపడ్డారు.