మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల దుర్వినియోగం కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్న బుధవారం మైసూరు లోకాయుక్త ముందు హాజరయ్యారు. తన భార్య పార్వతికి భూముల కేటాయింపు విషయంలో సీఎం సిద్దరామయ్య అధికార దుర్వినియోగం చేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అవినీతి కుంభకోణాల ఆరోపణలపై లోకాయుక్త విచారణ ఎదుర్కోవడం కర్ణాటకలో ఇదే మొదటిసారి.
లోకాయుక్త పోలీసు అధికారులు ముఖ్యమంత్రిని 20కి పైగా ప్రశ్నలు అడిగారు. సిద్దరామయ్య భార్య పేరు మీద 14 ప్లాట్లు స్వీకరించడానికి దారితీసిన పరిస్థితుల గురించి ప్రశ్నించారు. ఆ ప్లాట్ల కేటాయింపు గురించి జరిగిన ముడా సమావేశంలో సిద్దరామయ్య కొడుకు యతీంద్ర కూడా పాల్గొన్నారన్న వార్తల గురించి కూడా సీఎంను ప్రశ్నించారని తెలుస్తోంది.
విచారణ సందర్భంగా లోకాయుక్త పోలీసులు కీలకమైన డాక్యుమెంట్లు, సంతకాలు, ఫొటోగ్రాఫిక్ ఆధారాలను తనిఖీ చేసారు. ఆ విచారణకు సిఎం తన అధికారిక వాహనంలో కాకుండా వ్యక్తిగత వాహనంలో హాజరయ్యారు.
ఈ వివాదంలో ఫిర్యాదిదారు అయిన ఆర్టిఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ, సిద్దరామయ్యను అడగవలసిన ప్రశ్నల విషయంలో కచ్చితంగా ఉండాలని లోకాయుక్త పోలీసులకు సూచించారు. కీలకమైన ప్రశ్నలు అడగకుండా వదిలేస్తే తాను ఆ దర్యాప్తు అధికారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
అయితే సీఎంను లోకాయుక్త విచారించడం మ్యాచ్ ఫిక్సింగేనని కర్ణాటక బీజేపీ మండిపడింది. ఆ పార్టీ నాయకుడు ఆర్ అశోక ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ లోకాయుక్త అధికారులతో సిద్దరామయ్య మ్యాచ్ ఫిక్సింగ్ చేసారని ఆరోపించారు. ముఖ్యమంత్రి బుధవారం షెడ్యూల్లో లోకాయుక్త విచారణ రెండుగంటల పాటు ఉంటుందని ప్రస్తావించి ఉంది. లోకాయుక్త తనను రెండుగంటలు మాత్రమే విచారిస్తుందని సీఎంకు ముందుగా ఎలా తెలుసు, ఆ విచారణ జరగాల్సిన వ్యవధి ఎంతో ఆయనే నిర్దేశించారా, లోకాయుక్త అధికారులు ముఖ్యమంత్రితో కుమ్మకయ్యారా అనే అనుమానాలను అశోక లేవనెత్తారు.
‘లోకాయుక్తలో పోలీసులను ముఖ్యమంత్రే నియమిస్తారు. లోకాయుక్త విచారణలో వారే ఆయనను ప్రశ్నిస్తారు. వారెలాగూ ఆయనకే అనుకూలంగా వ్యవహరిస్తారు. అది సిగ్గుచేటు. సిద్దరామయ్య తన జీవితం తెరచిన పుస్తకమని చెబుతారు. ఆ పుస్తకం మీదనే ఇప్పుడు నల్లని మరకలు పడ్డాయి’ అని అశోక వ్యాఖ్యానించారు.
బీజేపీ నేత అశోక వ్యాఖ్యలతో కర్ణాటకలో కాంగ్రెస్-బీజేపీ వర్గాల మధ్య మాటల మంటలు రగిలాయి. సిద్దరామయ్య తన నిజాయితీని వెల్లడించుకోవాలని ఆయన మీద ఒత్తిడి పెరుగుతోంది.