హిందూ దేవాలయాలు, హిందూ భక్తులపై దాడుల తరవాత కెనడా, భారత్ దౌత్యసంబంధాలు మరింత దిగజారాయి. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో నిర్వహిస్తోన్న కాన్సులర్ క్యాంపులను రద్దు చేసింది. కెనడాలో రక్షణలేదని విదేశాంగశాఖ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
కెనడాలో హిందువులపై దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. కెనడా ప్రభుత్వం చట్టాన్ని రక్షిస్తుందని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భద్రతా కారణాలరీత్యా టొరంటోలోని కాన్సలేట్ క్యాంపును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కాన్సలేట్ క్యాంపులకు కనీస భద్రత కల్పించలేమని కెనడా ప్రకటించడంతో రద్దు చేస్తున్నట్లు క్యాన్సులేట్ అధికారి ఒకరు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
కెనడాలో హిందూ దేవాలయాలపై ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడులను ప్రధాని మోదీ ఖండించారు. ఇలాంటి దాడులు భారతదేశపు దృడనిశ్చయాన్ని బలహీనపరచలేవని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.కెనడా ప్రభుత్వం చట్టబద్ద పాలనను నిలబెడుతుందని ఆశిస్తున్నాం అంటూ మోదీ పోస్ట్ పెట్టారు.