అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లకు ఊతం ఇచ్చాయి. దీంతో పెట్టుబడిదారులు విలువైన లోహాల కొనుగోళ్లు తగ్గించారు.అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికకావడంతో డాలరు బలపడుతుందనే అంచనాలతో ఆవైపు పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ ప్రభావం మెటల్ మార్కెట్లపై పడింది. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
గడచిన నాలుగు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.3వేలు తగ్గింది. కిలో వెండి ధర రూ.10 వేలకుపైగా దిగివచ్చింది. తాజాగా ఔన్సు బంగారు ఒకే రోజు 75 డాలర్లు తగ్గి 2660కు దిగివచ్చింది. 2801 అమెరికా డాలర్ల నుంచి ఔన్సు బంగారం 2660కు తగ్గింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 82 వేల నుంచి 79 వేలకు దిగివచ్చింది. కిలో వెండి రూ.92700 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందనే అంచనాలతో డాలర్ కొనుగోళ్లు పెరిగాయి. గత నెలలోనే డాలర్ 3 శాతంపైగా బలపడింది. ముడిచమురు ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ 74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.