కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ అయ్యారు. అయితే ప్రస్తుతం అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. వైసీపీ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ కీలకంగా వ్యవహరించే వర్రా రవీంద్రరెడ్డిపై నమోదైన కేసు విషయంలో సరైన చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని ప్రచారం జరుగుతోంది. రవీంద్రరెడ్డి చేసిన అసభ్యకర పోస్టులపై ఫిర్యాదులు వచ్చినా, చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రభుత్వం తప్పుబడుతోంది. కడప జిల్లాలో ఓ సీఐని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేశ్, అనితపై సామాజిక మాధ్యమాల్లో రవీంద్రరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టినట్లు కేసు నమోదైంది.
పులివెందులకు చెందిన రవీంద్రరెడ్డిని ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న రవీంద్రరెడ్డి, వైసీపీ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీ నేతలపై తీవ్ర పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తీవ్రంగా విమర్శించినట్లు పలువురు ఫిర్యాదు చేశారు.
కడప పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకుని 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. మరో కేసులో అదుపులోకి తీసుకోవడానికి రాజంపేట పోలీసులు నిన్న రాత్రి కడప తాలూకా పోలీస్స్టేషన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. కానీ, కడప పోలీసులు అతడిని రాజంపేట పోలీసులకు అప్పగించకుండా బయటకు పంపారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కర్నూల్ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ వెంటనే కడపకు వెళ్లి కేసు వివరాల గురించి ఆరా తీయాలని ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి.