ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ్టి సమావేశంలో ఏపీ డ్రోన్ పాలసీ 2024కు ఆమోదముద్ర వేసింది. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ని రూపొందించింది.
డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ నిర్ణయించుకుంది. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా మన రాష్ట్రాన్ని, డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లును తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేయాలని డ్రోన్ కార్పొరేషన్ భావిస్తోంది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ అభివృద్ధి చేయనున్నారు. ఆ ప్రాంతాన్ని డ్రోన్ల తయారీ పరిశ్రమలు, టెస్టింగ్ ఫెసిలిటీ, ఆర్ అండ్ డి సదుపాయాల కోసం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ పరికరాల తయారీ పరిశ్రమలన్నీ ఒకేచోట ఉండేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దేశంలో ఎక్కడా అటువంటి ఫెసిలిటీ లేదు. తద్వారా ప్రపంచదేశాల దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించాలని డ్రోన్ కార్పొరేషన్ ప్రయత్నిస్తోంది
రాష్ట్రంలో 25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇస్తారు. దానికోసం రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వాటిలో శిక్షణ పొందేవారికి రూ.2వేలు ప్రోత్సాహకం కూడా ఇస్తారు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని ఐటిఐలు, పాలిటెక్నిక్‌లు, ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో పీపీపీ విధానంలో 50 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. డ్రోన్ల రంగంలో 15వేలమందికి ప్రత్యక్షంగానూ, 25వేల మందికి పరోక్షంగానూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందేలా ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యా సంస్థలకు రూ.20 లక్షల పరిశోధన గ్రాంటు కూడా ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.