వైట్‌హౌస్‌లో మళ్ళీ అడుగుపెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధపడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ తన ప్రభుత్వపు కీలకమైన విధాన నిర్ణయాల్లో ఒకదాని గురించి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపివేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. ట్రంప్ ప్రత్యేకించి ఏ దేశం పేరునూ ప్రస్తావించకపోయినా ట్రంప్ సర్కారు ప్రధానంగా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ మీద దృష్టి సారిస్తారని అంతర్జాతీయ రాజకీయాల విశ్లేషకులు భావిస్తున్నారు.
‘‘నేను యుద్ధాలు మొదలుపెట్టను, నేను యుద్ధాలను ఆపడానికి పనిచేస్తాను’’ అని ట్రంప్ తన విజయ ప్రసంగంలో చెప్పారు. మా పాలనాకాలంలో యుద్ధాలు లేవు. నాలుగేళ్ళ పాటు ఏ యుద్ధాలూ జరక్కుండా చూసాం. ఒక్క ఐసిస్‌ను ఓడించడం తప్ప మేము ఇంకెవరితోనూ యుద్ధం చేయలేదు’’ అని ట్రంప్ చెప్పారు.
2016 నుంచి 2020 వ్యవధిలో తన పదవీకాలంలో డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడితో సమావేశమైన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. సింగపూర్‌లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్‌తో చేతులు కలపడం చారిత్రక సన్నివేశంగా నిలిచిపోయింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలను మొదటినుంచీ జాగ్రత్తగా అనుసరిస్తున్నది ఉక్రెయిన్ వాసులే. ట్రంప్ విజయం సాధిస్తే, రష్యా బలగాలతో తమ యుద్ధానికి అమెరికా నుంచి అందుతున్న సాయం ఆగిపోతుందన్నది వారి భయం. ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యం వెనుకంజ వేస్తుంటే, ఉత్తరకొరియా సైనిక బలగాల సాయంతో రష్యా మరింత బలంగా కనిపిస్తోంది. ఈ సమయంలో ట్రంప్ గెలుపు ఉక్రెయిన్‌కు ఇబ్బందికరమైన పరిణామం.
జో బైడెన్ హయాంలో అమెరికా ఉక్రెయిన్‌కు బిలియన్ల కొద్దీ డాలర్లు, నాటో బలగాల ద్వారా కుప్పల కొద్దీ ఆయుధాల సహాయం అందజేసింది. అంత బలమైన అండ ఉండబట్టే, ఉక్రెయిన్ ఇప్పటివరకూ రష్యాను నిలువరించగలిగింది. యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు సైతం తమకు ఇష్టం లేకపోయినా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వవలసి వచ్చింది. ఆ పరిస్థితి గత కొద్ది నెలలుగా మారుతూ వస్తోంది. ఇప్పుడు ట్రంప్ గెలుపుతో ఉక్రెయిన్ ఆశలు అడియాసలయ్యాయి.
ట్రంప్ మొదటినుంచీ, ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేయడాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. తను అధికారంలోకి వస్తే రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని 24గంటల్లో ఆపేస్తాననీ చాలాసార్లు చెప్పారు. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది.