అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ విజయం సాధించారు. జేడీ వాన్స్ భార్య , ఆంధ్రప్రదేశ్ కు చెందిన మూలాలు ఉన్న వ్యక్తి కావడం విశేషం. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి పేరు,భారత్‌లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మార్మోగిపోతోంది. ఉష తెలుగమ్మాయి కావడం ఇందుకు కారణం. ఆమె అమెరికాకు సెకండ్ లేడీగా వ్యవహరించనున్నారు. ఒహాయో రాష్ట్ర సెనేటర్ జేడీ వాన్స్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ఎంచుకున్నారు.
ఉషా చిలుకూరిది విద్యావంతుల కుటుంబం. ఆమె పూర్వీకులు కష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉండేవారు. విశాఖపట్నంలోనూ ఆమె చుట్టాలు ఉన్నారు. వైజాగ్‌కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ సి శాంతమ్మ (96)కు ఉష మనవరాలు అవుతారు. శాంతమ్మ ప్రస్తుతం ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు.
ఉషా చిలుకూరి అమెరికాలోనే పుట్టి పెరిగారు. ఆమె తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980ల్లోనే అమెరికాకు వెళ్ళారు. వీరికి ముగ్గురు సంతానం కాగా, తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలు కాగా, తండ్రి రాధాకృష్ణ ఏరోస్పేస్ ఇంజినీర్.
గత ప్రభుత్వంలో భారత మూలాలున్న కమల హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు.