ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు.
మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఓట్లు సాధించిన పార్టీ గెలిచినట్లవుతుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఇప్పటివరకూ 277 ఎలక్టోరల్ ఓట్లు గెలిచి, కనీస మెజారిటీని సాధించింది. ఇంకా మూడు రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు మరో 30వరకూ ఎలక్టోరల్ ఓట్లు వచ్చే అవకాశముంది.
ట్రంప్, ఆయనకు చెందిన రిపబ్లికన్ పార్టీ జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, కాన్సాస్, అయోవా, మోంటానా, ఊటా, నార్త్ డకోటా, వ్యోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహామా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరీ, మిసిసిపీ, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఇడాహో, విస్కాన్సిన్ రాష్ట్రాలను దక్కించుకున్నాయి.
మరోవైపు కమలా హారిస్ నేతృత్వంలోని డెమొక్రటిక్ పార్టీ 224 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకుంది. కాలిఫోర్నియా, ఆరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇలినాయ్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలావేర్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, కొలరాడో, హవాయ్, న్యూహాంప్‌షైర్, మిన్నెసోటా, కొలంబియా రాష్ట్రాలు ఆ పార్టీ దక్కించుకుంది.
ఇంకా మరికొన్ని ఎలక్టోరల్ ఓట్లు ఫలితాలు వెలువడవలసి ఉన్నప్పటికీ, మెజారిటీ మార్క్ సాధించడంతో తదుపరి అధ్యక్షుడు ట్రంప్ అన్న విషయం ఖరారైపోయింది.