కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజలకు హైవోల్టేజ్ షాక్ ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీల సర్దుబాటు భారం వైసిపి చేసిన పాపమైతే, కూటమి ప్రభుత్వం పెడుతున్న శాపమని మండిపడ్డారు.
విద్యుత్ చార్జీల పెంపుదలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడిన షర్మిల, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారన్నారు. ఇప్పటికే రూ.6 వేల కోట్ల భారం మోపారనీ, అది చాలదన్నట్లు ఇంకో 11 వేల కోట్ల బాదుడుకు సిద్ధపడుతున్నారనీ చెప్పారు. మొత్తంగా సర్దుబాటు పేరిట ప్రజల మీద రూ.17వేల కోట్ల భారం మోపుతున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలపై ఎన్నో హామీలిచ్చిన సంగతి గుర్తు చేసారు. ‘‘వైఎస్ఆర్సిపి తమ హయాంలో 9సార్లు కరెంటు చార్జీలు పెంచిందని చంద్రబాబు నాయుడు గగ్గోలు పెట్టారు. తెలుగుదేశం అధికారంలో ఉంటే అలా జరిగేది కాదన్నారు. వైసీపీ 35 వేల కోట్ల భారం వేసిందన్నారు. కూటమి అధికారంలో వచ్చాక చార్జీలు 30 శాతం తగ్గిస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా? ప్రతిపక్షంలో ఉండగా చేసిన హామీలు నిలబెట్టుకోరా? జగన్ ఐదేళ్ళలో రూ.35వేల కోట్లు భారం మోపితే, మీ 5 నెలల పాలనలో 17వేల కోట్లు భారం మోపారు. ఇది న్యాయమా చంద్రబాబు? జగన్ హయాంలో విద్యుత్ కొనుగోళ్ళలో అవకతవకలు జరిగాయన్నారు. అలా జరిగితే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. హిందూజా లాంటి కంపెనీకి రూ. 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలి. కానీ ఆ భారాన్ని ప్రజలపై ఎందుకు మోపుతున్నారో చంద్రబాబు జవాబివ్వాలి. ఇప్పటికే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. గత ప్రభుత్వ పాపాలకు ప్రజల మీద భారం మోపుతారా?’’ అని షర్మిల మండిపడ్డారు.
కేంద్రప్రభుత్వం దగ్గర చంద్రబాబుకు పరపతి ఉందన్న షర్మిల, కేంద్రం నుంచి నిధులు తెచ్చి విద్యుత్ బిల్లులు మీరే చెల్లించాలంటూ డిమాండ్ చేసారు. బీజేపీకి గత పదేళ్ళుగా ఊడిగం చేస్తున్నారు, కేంద్రంలో ఆ పార్టీకి మద్దతిచ్చారు. అలాంటప్పుడు విద్యుత్ కోసం నిధులు మీరే తేవాలి అని షర్మిల కోరారు. ప్రజల నెత్తిన విద్యుత్ భారం వేస్తే ఊరుకోబోమన్నారు. సర్దుబాటు చార్జీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు.
‘‘ఇప్పటికే సూపర్ సిక్స్ అమలులో ఫెయిల్ అయ్యారు. సంక్షేమ పథకాల పేరిట ఒక చేత్తో ఇస్తున్నారు, మరో చేత్తో వసూలు చేస్తున్నారు. ఇచ్చేది పావలా, వసూలు చేసేది రూపాయి. ప్రజలపై సర్దుబాటు భారం మోపింది వైసీపీ కాదని ఎవరూ అనడం లేదు. వారు తప్పు చేసారు కాబట్టే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారు. రూ.35 వేల కోట్ల భారం వేసినందునే ప్రజలు వైసీపీని ఓడించారు. అది వైసిపి చేసిన పాపమైతే… ఇది కూటమి పెడుతున్న శాపం. వైసీపీకి, కూటమికీ తేడా లేదు’’అని షర్మిలారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును నిలదీసారు.