తెలంగాణలో కులగణన సర్వే మొదలైంది. తెలంగాణ లో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సర్వే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక వివరాలను సేకరిస్తున్నారు.
ఆస్తులు, అప్పులు, ఆదాయం, ఇంట్లో ఎంతమంది ఉంటారనే విషయాలు తెలుసుకుని రాసుకుంటున్నారు. విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎవరైనా వెళ్లారా… ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా వంటి మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు.
సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతిఒక్కరి ఫోన్ నంబరు, వారుచేసే వృత్తి, ఉద్యోగ వివరాలు కూడా నమోదు చేసుకుంటున్నారు.
కుటుంబంలో ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్లారనేది కూడా చెప్పాల్సి ఉంది. ఉన్నత చదువు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి అవసరాలకు వెళ్లారా అని ప్రశ్నిస్తున్నారు.
విదేశాలకు వెళితే ఆయా దేశాలకు ప్రత్యేక కోడ్ కేటాయించి ఆ నంబరు నమోదు చేసుకుంటున్నారు. తెలంగాణ నుంచి ఎంతమంది వలస పోయ్యారనే విషయం కూడా ఈ సర్వేతో తేలనుంది.
సర్వే కారణంగా రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు నేటి నుంచి సగంపూటే నడవనున్నాయి. సర్వే కోసం సెండరీ గ్రేడ్ టీచర్లు, హెచ్‌ఎంల సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఈనెల 30 వరకు సర్వే కొనసాగనుంది.