కేసును క్వాష్ చేయాలని హైకోర్టు ఆదేశం
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎన్నికల సమయంలో నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉండగా అనుమతులు లేకుండా అల్లు అర్జున్ జన సమీకరణ చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది.
అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో షూటింగ్ నిమిత్తం తిరుపతి వెళుతూ నంద్యాలకు వచ్చారు. వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన తన మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో బన్నీని చూసేందుకు వేలాది మంది అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. దీంతో అల్లు అర్జున్ తో పాటు శిల్పా రవిపై నంద్యాల పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.