జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తను గెలుపు సాధించిన పిఠాపురం నియోజకవర్గంలో మరో పన్నెండెకరాల భూమి కొనుగోలు చేసారు. పవన్ కళ్యాణ్ గతంలో ఆ ప్రాంతంలోనే సుమారు మూడున్నర ఎకరాలు కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, పవన్ కళ్యాణ్ తరఫున భూమి కొనుగోలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం పూర్తి చేసారు. ఆ స్థలంలో ఉపముఖ్యమంత్రి తన నివాసం, క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుంటారని తెలుస్తోంది. 2024 ఎన్నికల ప్రచార సమయంలో పవన్ పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని హామీ ఇచ్చారు. ఆ హామీని పూర్తి చేసే క్రమంలోనే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ యేడాది జులై నెలలో పిఠాపురం మండలం భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాల భూమి కొనుగోలు చేసారు. ఆ ప్రదేశంలోనే ఇప్పుడు మరోసారి భూమి కొన్నారు. ఆ పని కోసం పవన్ కళ్యాణ్ సోమవారం అక్కడికి వచ్చివెళ్ళారు.