కెనడాలో హిందూ దేవాలయంపై ఖలిస్తానీ అతివాదులు దాడి చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ఆ మేరకు విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు. కెనడాలో హిందువులకు స్వీయరక్షణ చేసుకునే హక్కు ఉన్న సంగతిని ట్రూడొ పార్టీ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
‘‘కెనడాలోని హిందూ దేవాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ భారత దౌత్య కార్యాలయం ఒక క్యాంప్ నిర్వహించింది. దాని గురించి భారత ఎంబసీ మూడు రోజుల క్రితమే కెనడా ప్రభుత్వానికి తెలియబరచింది. సరైన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. కానీ ట్రూడో ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని విస్మరించింది’’ అని అలోక్ కుమార్ చెప్పారు.
అక్టోబర్ 31న దీపావళి పండుగ సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ ‘హిందూ కెనడియన్ల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నాము. వారు స్వేచ్ఛగా తిరగవచ్చు, తమ మతాన్ని గర్వంగా అనుసరించవచ్చు’ అని చెప్పుకొచ్చారు. అయితే ట్రూడో మాటలు ఉత్త కబుర్లు మాత్రమేననీ, ఆచరణలో మాత్రం దానికి విరుద్ధంగా ఉందనీ అలోక్ కుమార్ పెదవి విరిచారు.
కెనడాలో గుడులపై దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదని అలోక్ కుమార్ గుర్తు చేసారు. అంతకుముందు గ్రేటర్ టొరంటో, బ్రిటిష్ కొలంబియా, బ్రాంప్టన్ నగరాల్లోని హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన సంగతిని గుర్తు చేసారు.
‘‘కెనడాలో ట్రూడో ప్రజాదరణ తగ్గిపోయింది. అతని పార్టీ ఎంపీలే బహిరంగంగా అతని రాజీనామా కోరుతున్నారు. ఖలిస్తానీ అనుకూల ఎంపీల మద్దతు మీదే ట్రూడో భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే ట్రూడో ఖలిస్తానీలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాడు. ట్రూడో ప్రవర్తన వల్లనే భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, లౌకికవాదం అనే మౌలిక నియమాలు కెనడాలో ఉల్లంఘనకు గురయ్యాయి’’ అని అలోక్ కుమార్ వివరించారు.
కెనడాలోని హిందువులకు కూడా ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందన్న సంగతిని కెనడా ప్రస్తుత ప్రభుత్వం, ఖలిస్తానీ మద్దతుదారులూ మరచిపోకూడదని అలోక్ కుమార్ గుర్తుచేసారు.