అమెరికా ఎన్నికల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. అమెరికాలో జరుగుతోన్న ఎన్నికల్లో ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కాబోతున్నారంటూ సర్వేలు తేల్చిపడేయడంతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది. ఒక దశలో సెన్సెక్స్ 1100 పాయింట్లుపైగా పెరిగింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు మొత్తం భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 694 పాయింట్ల లాభంతో 79476 వద్ద ముగిసింది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 24213 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. మెటల్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 30 ఇండెక్సులో 18 షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ముగియగా, ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలను ఆర్జించాయి.
ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో ముడిచమురు ధరల్లో పెరుగుదల నమోదైంది. బ్యారెల్ క్రూడాయిల్ 75.26 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత వారం 74 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో 31 గ్రాముల స్వచ్ఛమైన ఔన్సు గోల్డ్
2747 అమెరికా డాలర్లకు తగ్గింది. వెండి కిలో రూ.5 వేలు తగ్గి 95 వేలకు దిగివచ్చింది.