హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్లో ఓ దేవాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయంలో చొరబడిన దుండగులు విగ్రహాలు ధ్వంసం చేశారు. ఎయిర్పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేసేందుకు పూజారి ఆలయంలోకి వెళ్ళగా విగ్రహాలు ధ్వంసమై ఉండటాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం అందించాడు. స్థానికులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దుండగులు సోమవారం అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గుడి గేట్లను తెరిచి లోనికి ప్రవేశించినట్లుగా తేలింది. బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితుడిని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
దేవాలయంలో స్వామిని తిరిగి ప్రతిష్ఠించే అంశంపై స్థానికులు సమాలోచన చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడిలోనూ దుండగులు ఇదే తరహా ఘాతుకానికి పాల్పడ్డారు. మూడు వారల వ్యవధిలో హైదరాబాద్ లో ఇది రెండో ఘటన.