ప్రభుత్వ అవసరాలకోసమంటూ ప్రైవేటు ఆస్తులను ఎడాపెడా గుంజుకోవడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదని, ఉమ్మడి ప్రయోజనాల కోసం తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. 9 మంది సభ్యుల ధర్మాసనంలో 8:1 రేషియోలో 8 మంది ఈ తీర్పు వెలువరించారు.
కోల్‌కతా కార్పొరేషన్ పార్కు అవసరాల కోసమంటూ ఓ వ్యక్తి ఆస్తులను తీసుకుంది. ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ఆస్తి హక్కును ప్రాధమిక హక్కుల నుంచి తొలగించినా, వ్యక్తుల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆస్తులు స్వాధీనం చేసుకునే ముందు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ముందుగా నోటీసులు ఇవ్వడం, వారి అభిప్రాయాలు తీసుకోవడం, పరిహారం చెల్లించడం వంటి కార్యక్రమాలు పూర్తి చేసిన తరవాతే ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.
1950లో ఆస్తుల జాతీయీకరణ జరిగింది, ప్రస్తుతం పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. తప్పనిసరి అయితే ప్రైవేటు ఆస్తులు, నిబంధనల మేరకు స్వాధీనం చేసుకోవచ్చని సూచించింది.
ప్రైవేటు ఆస్తులు స్వాధీనం చేసుకునే విషయంలో యజమానులకు సమ్మతిలేని పరిహారం చెల్లించడాన్ని అంగీకరిచేది లేదని కోర్టు తేల్చి చెప్పింది. అత్యవసరం అయితే ఆ ఆస్తిని ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలని, యజమానుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.