నేరాల నియంత్రణ, బాధితులకు సత్వరం న్యాయం చేసేందుకు అవసరమైతే తాను హోంశాఖ తీసుకుంటానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపాయి. దీనిపై పాలకపక్షంలోని మంత్రులు, ముఖ్యనేతలు స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారాక తిరుమల రావు స్పందించారు.
హోంమంత్రి ఏమన్నారంటే…?
రాష్ట్రంలో జరుగుతున్న నేరాల విషయంలో అందరూ బాధపడుతున్నామని హోంమంత్రి అనిత అన్నారు. ‘‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయటపడ్డారు, మేం పడలేదు.. అంతే తేడా’’ అని చెప్పారు.డిప్యూటీ సీఎం పవన్ తో తాను మాట్లాడినట్లు చెప్పిన హోంమంత్రి అనిత, ఆయన చేసిన వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. భావప్రకటనా స్వేచ్ఛపేరిట సోషల్ మీడియాలో ఇతరులను బాధించేలా పోస్టులు పెట్టడం సరికాదన్నారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలపై చర్చించామన్నారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో లైంగికదాడి కేసు జరగడం బాధాకరమన్న హోంమంత్రి అనిత,గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించడమే ఇప్పుడీ పరిస్థితికి కారణమన్నారు. నేరస్థులకు వెంటనే శిక్షలు విధించి, అమలు చేయడానికి ప్రత్యేక న్యాయస్థానాలు అవసరమన్నారు.
నో కామెంట్ ప్లీజ్ : డీజీపీ
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ స్పందించారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై తాను ఎలాంటి కామెంట్ చేయడం లేదన్న డీజీపీ గత ప్రభుత్వ హయాంలోజరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అనంతపురంలో డీజీపీ ద్వారక తిరుమలరావు మీడియాతో మాట్లాడారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండూ ముఖ్యమే అన్నారు.
మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపిన డీజీపీ ద్వారక తిరుమలరావు, పోలీసు వ్యవస్థను ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కూడా సరిగా విధులు నిర్వహించలేదన్నారు. ఓ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినా బాధ్యతాయుతంగా స్పందించలేదన్నారు.భావప్రకటనా స్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని కేసు రాశారన్నారు. ఆ కేసులో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని వివరించారు. అలాగే ఓ ఎంపీని పోలీసులు కొట్టిన కేసులో కూడా ఏం జరిగిందో తేల్చలేదన్నారు.
ఐజీ సంజయ్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. నివేదిక తొలుత జీఏడికి వెళుతుందని, అక్కడి నుంచి తమకు అందుతుందని చెప్పారు. తప్పు జరిగినట్లు తేలితే ఎన్ని ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ ఏమన్నారంటే…?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలోని కొందరు పోలీసులు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఓ ఎస్పీ తనపై జులుం ప్రదర్శించారని గుర్తు చేశారు. ప్రజలకు అభివాదం చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
లా అండ్ ఆర్డర్ బలంగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి తాను చెబుతున్నానని తెలిపారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు సరిగా వ్యవహరించడం లేదన్నారు. గతంలో శాంతిభద్రతలు మొత్తం నియంత్రణలో లేకుండా చేసేశారన్న పవన్, ఇప్పుడేమో ధర్మబద్ధంగా శాంతిభద్రతలు అమలు చేయమంటుంటే ఆలోచిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారో అర్థం కావడంలేదు అన్నారు..
క్రిమినల్ కు కులం, మతం ఉండదన్న విషయం పోలీసులకు ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. నేరస్థుడిని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య వస్తుందని చెప్పడం సరికాదంటున్నారు. మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా అని ప్రశ్నించారు. క్రిమినల్స్ ను వెనకేసుకురమ్మని భారతీయ శిక్షా స్మృతి చెబుతోందా అని నిలదీశారు.
అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ కీలకమన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్, జిల్లా ఎస్పీలు కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వైసీపీ వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు రౌడీల్లా వ్యవహరిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు అవమానం జరుగుతుంటే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.
తాను పంచాయతీ, అటవీ, సైన్స్ టెక్నాలజీ మంత్రిని అని, హోంమంత్రిని కాదన్నారు. పరిస్థితి చేయిదాటితే తానే హోంశాఖను తీసుకుంటా అన్నారు. క్రిమినల్స్ నియంత్రణకు యూపీ సీఎం యోగీలా వ్యవహరించాలన్నారు.