కేంద్ర ప్రభుత్వం, వికీపీడియాకు నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు ఈ తాఖీదులు ఇచ్చింది. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం పొందుపరుస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు.దీనిపై కేంద్రం చర్యలు చేపట్టింది.
చిన్న సంస్థలకు కూడా ఎడిటోరియల్ నియంత్రణ ఉన్నప్పుడు వికీపీడియాలో అలాంటి వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపీడియాను మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా ఎందుకు పరిగణించకూడదో వివరణ ఇవ్వాలని కోరింది.వికీపీడియా ఇచ్చే సమాధానం ఆధారంగా కేంద్రం తదుపరి చర్యలు చేపట్టినంది.
2000 ఏడాదిలో ప్రారంభమైన వికీపీడియా , ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియాగా ప్రచారం చేసుకుంటుంది. వ్యక్తులు, అంశం, సబ్జెక్ట్ వంటి సందేహాల నివృత్తి కోసం పలువురు వికీపీడియాను ఆశ్రయిస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా వివిధ విషయాలు, సమస్యలపై వ్యాసాలు రాసి అప్లోడ్ చేసే సౌకర్యం ఉంది. ప్రస్తుతం వికీపీడియా 300 భాషలలో 56 మిలియన్ల కంటే ఎక్కువ కథనాలను పోస్ట్ చేస్తోంది.
ఇంగ్లీషుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉన్నాయి. తప్పుడు, గౌరవానికి భంగం కలిగించేలా కంటెంట్‌ను వికీపీడియా ప్రచురిస్తోందంటూ భారత్ లో ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ కూడా గతంలో దిల్లీ హైకోర్టులో దావా వేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా వికీపీడియాపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎవరైనా ఎడిట్ చేసుకొనే సదుపాయం కల్పించడం ‘ప్రమాదకరం’ అని పేర్కొంది.
చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగ కంటెంట్ క్రియేట్ చేయాలనే నిబంధన ఉందని వికీపీడియా వాదిస్తోంది.ఈ వివాదం నేపథ్యంలో కేంద్రం నుంచి వికీపీడియాకు నోటీసులు అందాయి.