వైసీపీ నేత,మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఓ కేసులో భాగంగా ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఐదేళ్ల కిందట ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో దాడిశెట్టి రాజా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
తుని నియోజకవర్గం తొండంగి మండల ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేసే కాతా సత్యనారాయణ (47).. 2019 అక్టోబరు 15న హత్యకు గురయ్యారు. రాత్రి 7 గంటల సమయంలో బైక్ పై ఎస్.అన్నవరంలోని ఇంటికి వెళ్తుండగా అడ్డుకుని కత్తులతో నరికి చంపారు. హత్యకు దాడిశెట్టి రాజా సూత్రధారి అని మృతుని కుటుంబీకులు అప్పట్లో ఆరోపించారు. వారి ఫిర్యాదుతో తుని రూరల్ పోలీసులు కేసు నమోదుచేశారు. దాడిశెట్టి సహా ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. చేర్చారు. అయితే దాడిశెట్టి రాజా ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో ఈ కేసులో
ఛార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అందులో రాజా పేరులేదు. దీంతో సత్యనారాయణ బంధువులు ఈ విషయాన్ని కోర్టులో సవాల్ చేశారు.
నిందితులను శిక్షించాలని సత్యనారాయణ సోదరుడు, న్యాయవాది కాతా గోపాలకృష్ణ న్యాయపోరాటం చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎన్హెచ్ఆర్సీతో పాటు హైకోర్టు లో పిటిషన్ వేశారు. తుని నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు.